భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
వైద్య పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని మణుగూరు ప్రాంతీయ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ పోస్టుతోపాటు పిల్లల వైద్య నిపుణుడి పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన వైద్యులను నియమించేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు గురువారం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. వేతనం రూ.2 లక్షలు, రూ.2.50 లక్షలు చెల్లిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలని తెలిపారు.
నాణ్యమైన ధార్మిక సేవలు
రామాలయ ఈఓ దామోదర్‌రావు
భద్రాచలంటౌన్: ధార్మిక సేవల నాణ్యత పెంపే లక్ష్యంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ‘సీత’ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు తెలిపారు. గురువారం అంబాసత్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్చకులు, సిబ్బంది, ధార్మిక సేవకుల సామర్థ్యాన్ని పెంచేందుకు తరగతులు దోహదపడతాయన్నారు. సీత సంస్థ డైరెక్టర్ చిలకపాటి రాఘవాచార్యులు మాట్లాడుతూ శిక్షణలో ఆగమశాస్త్రం, ఆలయ నిర్వహణ, పూజా విధానాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. శ్రీరామ చక్రవర్తి, కృష్ణమాచార్యులు, భవాని రామకృష్ణ పాల్గొన్నారు.


