జిల్లాలోని నాలుగు డిపోల్లో సిబ్బంది ఇలా...
● రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ● దశాబ్ద కాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు కసరత్తు ● జిల్లాలో 879 మంది ఆర్టీసీ కార్మికులు
చుంచుపల్లి: దశాబ్ద కాలం తర్వాత టీజీఎస్ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం కార్మిక శాఖ, ఆర్టీసీ యాజమాన్యం సన్నద్ధమవుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీలో రెండేళ్లకొకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. చివరిసారిగా 2016లో నిర్వహించారు. 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించలేదు. 2019లో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రభుత్వం సంఘాల గుర్తింపును పూర్తిగా రద్దు చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రాధాన్యం కోల్పోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి ఎన్నికల నిర్వహణకు హామీ ఇచ్చింది. ఆగస్టులోనే ఎన్నికల నిర్వహిస్తామని ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా లేబర్ కమిషన్‌తో చర్చలు జరిపిన ఆర్టీసీ సంఘాల జేఏసీ నాయకులు గత మంగళవారం మరోసారి ఎన్నికలపై సమావేశమయ్యారు. అన్ని విధాలా అనుకూలిస్తే ఈ నెల చివరి వారంలో ఎన్నికలు పూర్తిచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైతే ఆయా డిపోల పరిధిలో ఎన్నికల వేడి పెరిగే అవకాశం ఉంది.
ప్రచారంపై కార్మిక సంఘాల దృష్టి
ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కార్మిక సంఘాలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ, టీజేఎంయూ, ఐఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా, గుర్తింపు సంఘాలు రీజియన్, రాష్ట్రస్థాయిలో ఉంటాయి. రెండింటికి వేర్వేరు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక్కో కార్మికుడు రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది. గెలిచిన యూనియన్ కార్మిక సమస్యల పరిష్కారంలో, కార్మికుల తరఫున ఆర్టీసీ, యాజమాన్యం, ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులకు పని ఒత్తిడి తదితర సమస్యలు, సంక్షేమ పథకాలపై యాజమాన్యంతో చర్చించే అవకాశం ఉంటుంది.
ఆర్టీసీలో దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గుర్తింపు సంఘం ఉంటే కార్మిక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు. ఇప్పటికే డిపోల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా చూస్తున్నాం.
–కె.భాస్కర్‌రావు, రాష్ట్ర సహాయకార్యదర్శి, ఈయూ
డిపో పేరు సిబ్బంది
కొత్తగూడెం 204
భద్రాచలం 362
మణుగూరు 210
ఇల్లెందు 103


