సీతారామపై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

సీతారామపై నజర్‌

Jul 16 2026 5:12 AM | Updated on Jul 16 2026 5:12 AM

మంత్రుల టూర్‌ షెడ్యూల్‌

సీతారామపై నేడు నలుగురు మంత్రుల సమీక్ష

నేడు ఎన్‌జీటీలో సీతమ్మ సాగర్‌పై విచారణ

అనుమతుల్లో ఆలస్యం

పూర్తి స్థాయిలో అనుమతులు రాకముందే సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వేర్వేరు పనులను వివిధ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ పనులు 2018లో ప్రారంభించారు. 2022 చివరి నాటికి బరాజ్‌ను మినహాయించి ప్రధాన కాలువ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పనులు చాలా వరకు పూర్తయ్యాయి. దీంతో పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రాకుండానే గోదావరి నదిలో దుమ్ముగూడెం – అశ్వాపురం మండలాల మధ్య పాత కాటన్‌ ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్‌ బరాజ్‌ పనులను 2022 నవంబర్‌లో అప్పటి సర్కార్‌ మొదలు పెట్టింది. దీనిపై భద్రాచలం ఏజెన్సీకి చెందిన కొందరు వ్యక్తులు 2022 డిసెంబరులో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ), చైన్నె బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో పర్యావరణంతో పాటు అన్ని రకాల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలంటూ 2023 ఏప్రిల్‌ 26న ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది.

సీడబ్ల్యూసీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

బరాజ్‌ పనులు ఆగినప్పటికీ పాత కాటన్‌ ఆనకట్టను ఆధారంగా చేసుకుని నాగార్జున సాగర్‌ టెయిల్‌ ఎండ్‌కు గోదావరి జలాలు తరలించేందుకు రాజీవ్‌ కెనాల్‌ పనులు చేపట్టారు. మరోవైపు టెక్నికల్‌ అప్రైజల్‌, టెక్నో ఎకనామికల్‌ వంటి విషయాల్లో కేంద్ర జలసంఘం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. పర్యావరణ అనుమతులే రావాల్సి ఉంది. చివరిసారిగా 2025 అక్టోబరు 17న పర్యావరణ అనుమతులపై ఎన్‌జీటీలో వాదనలు జరిగాయి. అప్పుడు రూ.53.41 కోట్ల జరిమానాతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకునే భద్రత చర్యలు, పరిహారం అంశాలను తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌జీటీ కోరింది.

నెల రోజులుగా..

సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించి రావాల్సిన అనుమతులు, కొనసాగుతున్న పనులు, భూసేకరణ, అనుబంధ పనులు తదితర అంశాలపై గత నెల 11న జలసౌధ, హైదరాబాద్‌లో ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సమీక్ష తర్వాత డిస్ట్రిబ్యూటరీ కాల్వల భూసేకరణ పనుల్లో వేగం పెరిగింది. కలెక్టర్‌ అంకిత్‌ ప్రత్యేకంగా క్షేత్రస్థాయికి వెళ్లి భూసేకరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌తోపాటు ఇతర న్యాయస్థానాల్లో సీతారామపై దాఖలైన కేసుల విషయంలో సమర్థంగా వాదనలు వినిపించేందుకు కేంద్ర అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సహాయం తీసుకుంటున్నారు. గురువారం కూడా సీతారామపై ఎన్‌జీటీలో వాదనలు జరగనున్నాయి. అక్కడ సానుకూల ఫలితాలు వస్తే సీతమ్మ సాగర్‌కు సంబంధించిన ప్రధాన సాంకేతిక చిక్కులు తొలగిపోయినట్టే.

ఇతర అంశాలు

నేడు జరిగే సీతారామ సమీక్షలో కాటన్‌ ఆనకట్ట ద్వారా సాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతల్లో సాధక బాధకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మున్నేరు – పాలేరు లిఫ్ట్‌, ఇల్లెందు నియోజకర్గానికి అతి తక్కువ ఖర్చుతో సమర్థంగా సాగునీళ్లు ఎలా అందించాలనే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు యాతాలకుంట టన్నెల్‌ నిర్మాణ పనులను మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి కొత్తగూడెం చేరుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై ఐడీఓసీలో రివ్యూ చేస్తారు. మిగిలిన మంత్రులు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఉదయం 10:15 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా మంత్రులు మణుగూరు జూనియర్‌ కాలేజీకి చేరుకుంటారు. 10:30 గంటలకు కాటన్‌ ఆనకట్ట / సీతమ్మ బరాజ్‌ పరిశీలించి, సమీక్ష చేపడతారు. 11:50 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12:15 గంటలకు యాతాలకుంటకు చేరుకుని అక్కడి పనులను పరిశీలిస్తారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఎల్‌పీ)కు ప్రాధాన్యత పెరిగింది. ప్రాజెక్ట్‌కు రావాల్సిన అనుమతులు, జరుగుతున్న పనుల్లో పురోగతిని పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పర్యటించి సీతారామపై సమీక్ష నిర్వహించనున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

అనుమతుల సాధనలో కొనసాగుతున్న ఆలస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement