భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి బుధవారం ఆంధ్రపదేశ్‌కు చెందిన భక్తులు విరాళం అందచేశారు. విజయవాడలోని భవానీపురానికి చెందిన పమిడిపాటి పట్టాభి రామారావు రూ.1,11,111ను ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబకు అందించారు. దాతల కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0.863 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోత
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ ఫేజ్–1 పంప్‌హౌస్ నుంచి 0.863 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఈ నెల 8న బీజీ కొత్తూరు పంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించగా, ఎనిమిది రోజుల్లో 160 గంటల పాటు 0.863 టీఎంసీల నీరు ఎత్తిపోసినట్లు అధికారులు తెలిపారు. పంప్‌హౌస్‌లో ఆరు మోటార్లు ఉండగా ఒక్కో మోటారు 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ఎత్తిపోస్తున్నాయి. ఒకటో పంప్ ద్వారా 84 గంటల ఆరు నిమిషాలపాటు 0.454 టీఎంసీలు, రెండో పంపు ద్వారా 25 గంటలపాటు 0.135 టీఎంసీలు, ఐదో పంప్ ద్వారా 50 గంటల 54 నిమిషాలపాటు 0.274 టీఎంసీలు మొత్తం 0.863 టీఎంసీల నీరు ఎత్తిపోశారు. ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్, ఎన్‌ఎస్‌పీ కెనాల్, లంకా సాగర్ ప్రాంతాల ఆయకట్టుకు నీరు తరలిస్తున్నారు.
సమన్వయంతోనే పారదర్శకత
భద్రాచలం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అన్ని పార్టీల సమన్వయ, సహాయ సహకారాలతోనే పారదర్శక ఓటరు జాబితా సిద్ధమవుతుందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. బుధవారం తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు సక్రమంగా నమోదు చేసుకునేలా చూడాలని, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారి జాబితాను నిశితంగా పరిశీలించాలని చెప్పారు. తహసీల్దార్ రవికుమార్, ఎలక్షన్ డీటీ గోపాలకృష్ణ, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర టు అంతర్వేది
విదేశీయుడి సైకిల్ యాత్ర
అశ్వారావుపేటరూరల్: మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేదికి ఓ విదేశీయుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. పవిత్ర గోదావరి జన్మస్థలం నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర బుధవారం అశ్వారావుపేటకు చేరుకుంది. యూరప్‌లోని చెక్ రిపబ్లిక్‌కు చెందిన యావర్ గోదావరి నది విశిష్టత, ప్రవహించే మార్గాలు తెలుసుకునేందుకు మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో గతనెల 17వ తేదీన సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పరీవాహక, సమీప ప్రాంతాల మీదుగా సాగుతున్న ఈ యాత్ర ఏపీలోని కోనసీమ జిల్లా అంతర్వేదిలో గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుందని వివరించారు. సైకిల్ ముందు భాగంలో ‘జై గోదావరి తల్లి’ అంటూ తెలుగు, హిందీ భాషల్లో బోర్డు ఏర్పాటుచేసుకున్న ఆయన ముందుకు సాగుతున్నాడు.


