అశ్వాపురం: మండలంలో గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వ్యూ పాయింట్ వద్ద డిప్యూటీ సీఎం, మంత్రులు నిర్మాణంలో ఉన్న సీతమ్మసాగర్ బ్యారేజీని పరిశీలించి సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్ట్‌లపై అధికారులతో సమీక్షించనున్నారు. హైదరాబాద్ నుంచి మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి హెలీకాప్టర్‌లో చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుమ్మరి గూడెం రానున్నారు. మంత్రుల పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
హెలిప్యాడ్‌కు దొరకని స్థలం
డిప్యూటీ సీం మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన నేపథ్యంలో మండలంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన స్థలం దొరకలేదు. ఈ నెల 14న బీజీ కొత్తూరు, కుమ్మరిగూడెంలో కలెక్టర్ అంకిత్, బుధవారం రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పోలీస్ అధికారులు బీజీ కొత్తూరు, మొండికుంట,కుమ్మరిగూడెంలో పలు చోట్ల హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. మొండికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహించే స్థలంలో ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అది అటవీ భూమి అని, హెలిప్యాడ్ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అనువైన స్థలం లేక మణుగూరులో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.
కొత్తగూడెంలో పొంగులేటి..
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి గోధుమవాగు బ్రిడ్జి వరకు సెంట్రల్ డివైడర్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. భూభారతి, ఇందిరమ్మ గృహాల పథకంపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత విద్యానగర్ క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.
దమ్మపేట రోడ్డు విస్తరణ పనులు..
పాల్వంచ: దమ్మపేట సెంటర్ నుంచి కుంటినాగుల గూడెం వరకు రూ.14 కోట్లతో నిర్మించనున్న 2 కి.మీ. నాలుగు వరుసల రహదారికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేయనున్నారు.


