తీరని స్టాఫ్ కొరత
ఆస్పత్రుల వారీగా సిబ్బంది, ఖాళీలు ఇలా..
ప్రభుత్వాస్పత్రుల్లో సిరంజీలు, ఇంజెక్షన్ల కొరత
సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆగిపోయిన మందుల సరఫరా
ప్రజలకు పూర్తిస్థాయిలో అందని వైద్య సేవలు
ఇల్లెందు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రం మందులు లేవు. ఇంజెక్షన్లు, సిరంజ్‌లు కూడా లేవు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు ఏరియా ఆస్పత్రుల్లో మందుల కొరత ఉంది. కొత్తగూడెం సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందుల సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆ బిల్లులకు కూడా చెల్లింపులు లేవు. ఇల్లెందు ప్రభుత్వాస్పత్రిలోనే రూ. 12 లక్షల వరకు బిల్లు పెండింగ్‌లో ఉంది.
ఆరోగ్యశ్రీ నిధులేవి?
గతంలో ప్రభుత్వం మూడు నెలలకోసారి హాస్పిటల్ అభివృద్ధి నిధులు(హెచ్‌డీఎఫ్) అందించేది. వాటిని ఎత్తి వేసి ప్రైవేటు ఆస్పత్రి తరహాలో ఆరోగ్య శ్రీ సేవలకు ప్రభుత్వాస్పత్రులకు కూడా బిల్లులు చెల్లిస్తామని ప్రకటించింది. కానీ మూడేళ్లుగా ఆరోగ్య శ్రీ నిధులు రావడంలేదు. వైద్యం పొందుతున్న వారి సంఖ్య పెరిగతున్నా ఒక్క పైసా జమ చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రుల్లో మలేరియా, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. ఒక వన్ సీసీ, టూ సీసీ, 5 సీసీ సిరంజీలు కూడా లేవు. ఆపరేషన్ సమయంలో చేతులకు రక్షణగా ఉపయోగించే గ్లౌజ్‌లు కూడా నిండుకున్నాయి. కడుపు మంట కోసం ఉపయోగించే టాబ్లెట్లు సైతం నిలవ లేవు.
ప్రభుత్వాస్పత్రుల్లో అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెట్టాం. కొన్ని రకాల మందులు లేవు. అవసరాన్ని బట్టి లోకల్‌గా పర్చేజ్ చేస్తున్నాం. కొరత ఉన్నప్పటికీ.. ఉన్న సిబ్బందితోనే సేవలందిస్తున్నాం.
– డాక్టర్ జి. రవిబాబు, డీసీహెచ్‌ఎస్
ఏరియా ఆస్పత్రుల్లో స్టాఫ్ కొరత నెలకొంది. డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులు, ఎల్‌టీలు, ఇతర సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న సిబ్బందిలోనూ ఎక్కువ మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. చాలా ఆస్పత్రుల్లో కేడర్ స్ట్రెంత్ లేదు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన వారు, పని చేస్తున్న వారు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తక్కువ మంది సిబ్బంది, మందుల కొరతతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు.
ఆస్పత్రి మొత్తం ప్రస్తుత ఖాళీలు
పోస్టులు సిబ్బంది
మణుగూరు 101 40 61
భద్రాచలం 212 47 165
అశ్వారావుపేట 49 6 43
ఇల్లెందు 100 29 71
పాల్వంచ 72 51 21
బూర్గంపాడు 32 17 15
చర్ల 31 2 29


