● భద్రగిరిలో కొనసాగుతున్న ఫుట్‌బ్రిడ్జి తొలగింపు పనులు ● నేడు చిత్రకూట మండపం తొలగింపు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణలో భాగంగా నాలుగు వైపులా నిర్మాణాలకు మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఒక వైపు భవనాల నిర్మాణాల కూల్చివేత, శిథిలాల తొలగింపు జరుగుతుండగానే మరోవైపు నిర్మాణాల పనులు చేపడుతున్నారు. బుధవారం ఉత్తరం దిక్కున మార్కింగ్ చేయగా, మిగతా దిక్కుల్లో కూడా మార్కింగ్ చేయనున్నారు. హద్దుల మధ్యలోనే ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఉత్తరం దిక్కున ఉన్న 16 ఏళ్ల నాటి ఫుట్ బ్రిడ్జి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉత్తర ద్వారం తలుపులు తొలగించగా, నిర్మాణం కూల్చాల్సి ఉంది. దక్షిణ భాగంలో ఉన్న మెట్లను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పైకప్పు రేకులను తొలగించారు. గురువారం చిత్రకూట మండపం తొలగింపు పనులు కూడా చేపడతామని అధికారులు తెలిపారు. ఇప్పటికే కూల్చిన కుసుమ హరనాథబాబా ఆలయం శిథిలాల తొలగింపుతోపాటు మట్టి చదును పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి.
నేడో, రేపో ఉద్యోగులకు ఉత్తర్వులు
ఇటీవల దేవస్థానంలో ఖాళీగా ఉన్న వేదపండితులు, అర్చకులు, పరిచారిక తదితర పోస్టులకు హైదరాబాద్‌లో అర్హత పరీక్షలు జరిపారు. మొత్తం 21 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కాగా, నేడో, రేపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


