అశ్వారావుపేటరూరల్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతోపాటు అంతరాయం సమస్యను పరిష్కరించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎన్పీడీసీఎల్ కొత్తగూడెం ఎస్‌ఈ మహేందర్ తెలిపారు. బుధవారం అశ్వారావుపేట పట్టణ పరిధిలోని గుర్రాల చెరువు నుంచి 33కేవీ దమ్మపేట ఫీడర్(అంకంపాలెం వరకు) మంజూరైన ఫీడర్ కవర్డ్ కండక్టర్ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 28 కిలోమీటర్లకు తొలి విడతలో సుమారు రూ. కోటి వ్యయంతో గుర్రాల చెరువు నుంచి 6 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఫీడర్ కవర్డ్ కండక్టర్‌తో పామాయిల్, జామాయిల్, చెట్ల కొమ్మలు విరిగిపడిన విద్యుత్ సరఫరా నిలిచిపోదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 సబ్ స్టేషన్లు మంజూరు కాగా, వీటిలో ఇప్పటికే నాలుగింటి నిర్మాణం పూర్తయిందన్నారు. మరో 10 సబ్ స్టేషన్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, మిగిలిన 9 సబ్ స్టేషన్లు టెండర్ల ప్రక్రియలో ఉన్నట్లు వివరించారు. 56 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాలను పెంచడంతోపాటు గడిచిన రెండేళ్లలో మరో 14వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఆరుగురు సభ్యులతో ఈఆర్టీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పట్టణంలోని నందమూరినగర్ వద్ద నిర్మిస్తున్న 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈ నందయ్య, ఏడీఈ వెంకట రత్నం, ఏఈ వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం ఎస్‌ఈ మహేందర్


