భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
గోదావరికి నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదావరి నదీహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, 108 ప్రమిదల దీపోత్సవం, శ్రీరామ అష్టోత్తర శతనామార్చన జరిపారు.
పెద్దమ్మతల్లికి
విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో..
పెద్దమ్మతల్లి అమ్మవారిని ఇల్లెందు ఎమ్మెల్యే కొమరం కనకయ్య, కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్లు వి.రామచంద్రం, పి.వరలక్ష్మి, ఎన్.రామనాథన్ కిషన్ ఆర్.విజయలత, ప్రణయ్‌కుమార్‌లు దర్శించుని పూజలు చేశారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఐటీడీఏలో గిరిజన దర్బార్..
భద్రాచలంటౌన్: ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రా రంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని తెలిపారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి రద్దు
భద్రాచలంటౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఒక ప్రకటనలో తెలిపారు.
అయోధ్య అవినీతిపై
నేడు వీహెచ్ మౌనదీక్ష
భద్రాచలంటౌన్: అయోధ్య రామాలయ నిర్మాణంలో వస్తున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) సోమవారం ఉదయం 7 గంటలకు భద్రాచలంలో మౌనదీక్ష చేపట్టనున్నారు. రామాలయ ఉత్తర ద్వార దర్శనం వద్ద ఈ దీక్ష జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.


