కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతున్నారు.. | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతున్నారు..

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

● రిటైర్డ్‌ ఇంజనీర్ల నివేదిక చూసైనా సీఎం మేల్కొనాలి ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

● రిటైర్డ్‌ ఇంజనీర్ల నివేదిక చూసైనా సీఎం మేల్కొనాలి ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

అశ్వాపురం: కాళేశ్వరం నీళ్లు వస్తే కేసీఆర్‌ గొప్పతనం ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందోనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రాజెక్ట్‌ను పడుకోబెడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు. అశ్వాపురంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి మాట్లాడారు. రిటైర్డ్‌ ఇంజనీర్ల నివేదిక చూసైనా సీఎం రేవంత్‌ రెడ్డి సోయి తెచ్చుకోవాలన్నారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉందని, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్‌ చేయవచ్చని అన్నారు. మరో 100 రోజులపాటు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుందని రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేస్తే గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉందన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మేడిగడ్డ నుంచి భద్రాచలం వరకు 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు తెచ్చామని, అప్పుడు కొట్టుకుపోని భద్రాచలం ఇప్పుడు లక్ష క్యూసెక్కులు కూడా లేకపోయినా ఎలా మునిగిపోతుందని ప్రశ్నించారు. పోలవరంతో తప్ప మేడిగడ్డతో భద్రాచలానికి ప్రమాదం లేదన్నారు. ఎన్నికల సమయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మీద ఆన అంటూ ఇచ్చిన హామీలను సీఎం గాలికొదిలేశారని విమర్శించారు. యూరియా దొరకడం లేదని రైతులు రోడ్డెక్కితే వారు రైతులే కాదనడం హాస్యాస్పదమన్నారు. సింగరేణి సమస్యలపై పోరాడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కొల్లు మల్లారెడ్డి, కోడి అమరేందర్‌, మర్రి మల్లారెడ్డి, కంచుగంట్ల వీరభద్రం, ఎన్నా అశోక్‌ కుమార్‌, రావులపల్లి రాంప్రసాద్‌, పగడాల సతీష్‌ రెడ్డి, వట్టం రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement