‘ద్విభాష’తో సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

‘ద్విభాష’తో సత్ఫలితాలు

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

చదవడం ఈజీ.. భయం తగ్గుతోంది..

గతంలో 8వ తరగతి వరకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు

తాజాగా పదో తరగతి వరకు అందించిన ప్రభుత్వం

పక్కపక్కనే తెలుగు, ఆంగ్ల భాషల్లో పాఠాలు

ఇంగ్లిష్‌ను సులభంగా అర్థం చేసుకుంటున్న విద్యార్థులు

కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ద్విభాషా పాఠ్యపుస్తకాల విధానం సత్ఫలితాలు ఇస్తోంది. పక్కపక్కనే తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో పాఠ్యాంశం ఉండటంతో విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. వారిలో ఇంగ్లిష్‌ అంటే భయం కూడా పోతోంది. సైన్స్‌, గణితం, సాంఘిక శాస్త్త్రాల్లోని సాంకేతిక పదాలను అర్థం చేసుకుని పాఠాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. తొలుత విద్యార్థులు తెలుగులో చదివి భావాన్ని సులభంగా అర్థం చేసుకుంటున్నారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఇంగ్లిష్‌లో పాఠం చదివి పట్టు సాధిస్తున్నారు. సబ్జెక్ట్‌పై కూడా పూర్తి అవగాహన పెంచుకుంటున్నారు. తొలుత 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే ఈ విధానం అమలు చేయగా, తాజాగా పదో తరగతి వరకు విస్తరించారు. ఒకే పాఠ్యాంశం తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో చదవడం వల్ల మున్ముందు పోటీ పరీక్షల్లో నెగ్గడం విద్యార్థులకు సులువుగా మారనుంది.

పుస్తకాల భారం తగ్గించేలా...

రెండు భాషల్లో పాఠ్యాంశాలు ఉండటంతో పుస్తకాల పరిమాణం,పేజీల సంఖ్య పెరిగింది. దీంతో స్కూల్‌ బ్యాగుల బరువు పెరిగి పిల్లలు ఇబ్బంది పడకుండా పుస్తకాలను రెండు భాగాలుగా విభజించింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పార్ట్‌–1 పుస్తకాలను, దసరా సెలవుల అనంతరం పార్ట్‌–2 పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. కాగా కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే బోధన కొనసాగుతున్నందున పాఠ్యపుస్తకాలన్నీ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు.

నేను ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. పై తరగతులకు రాగానే ఇంగ్లిష్‌ పుస్తకాలు చూసి భయమేసింది. సార్‌ ఇంగ్లిష్‌లో చెబితే ఏమీ అర్థమయ్యేది కాదు. ద్విభాషా పుస్తకాలు వచ్చాక చదవడం ఈజీగా మారింది.

–చారి, పదో తరగతి విద్యార్థి,

భట్టుపల్లి జెడ్పీపాఠశాల

ద్విభాషా పాఠ్యపుస్తకాలు వచ్చాక పిల్లల్లో ఇంగ్లిష్‌పై ఉన్న భయం తగ్గింది. గతంలో ముందు భావం అర్థం కాక పిల్లలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు తెలుగు, ఇంగ్లిష్‌ రెండింటినీ పోల్చుకుంటూ నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం.

–మోహన్‌ బాబు,హెచ్‌ఎం భట్టుపల్లి జెడ్పీపాఠశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement