భద్రాచలంటౌన్: ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే... తనకు పదవులేం ముఖ్యం కాదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మాలల హక్కుల సాధన, వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడతానని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ అమలు, రోస్టర్ విధానం రద్దు కోసం భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన మహా ర్యాలీ, బహిరంగ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే వర్గీకరణ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా... ఉమ్మడి రాష్ట్రంలోని దామాషా ప్రకారమే ఈ విభజన జరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం కొన్ని సెక్టార్లనే పరిగణనలోకి తీసుకుని లెక్కించారని గుర్తుచేశారు. గతంలో షమీమ్ అఖ్తర్ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ నేపథ్యాన మాలలకు జరిగిన అన్యాయంపై తాను ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడతానని చెప్పారు. అలాగే, వర్గీకరణపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీలోని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో చర్చించి మాలలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని తాను ఇప్పటికే హెచ్చరించానని తెలిపారు. కాగా, మాల ఉద్యోగుల్లో ప్రస్తుతం ఆశించినంత ఆసక్తి కనిపించడం లేదని.. వారు చొరవ తీసుకుని హక్కుల సాధన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాల, మాల ఉప కుల సంఘాల నాయకులు, ఈఓ దామోదరరావు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం ఆయన హౌసింగ్‌బోర్డులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోస్టాఫీస్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ కొత్తగూడెంలో ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పాల్వంచలోని మాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయ భాస్కర్ ఇంట్లో మంత్రి తేనేటి విందు స్వీకరించగా, కాంగ్రెస్ నాయకులు కలిసి ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని కేటీపీఎస్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు విన్నవించారు. కేటీపీఎస్‌లో నిర్మిస్తున్న ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పలువురు మంత్రికి దృష్టికి తెచ్చారు. కార్పొరేటర్లు భవిత, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి


