పాత రైళ్ల పునరుద్ధణ కోరుతూ
వినతుల వెల్లువ
మణుగూరు సూపర్ ఫాస్ట్‌కు
కిన్నెరసానిగా పేరు పెట్టాలి
మణుగూరు–కాజీపేట ట్రైన్ పట్ల
రైల్వే శాఖ సానుకూల స్పందన
వినతుల వెల్లువ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతంలో నడిచి ఆగిపోయిన రైళ్లను పునరుద్ధరించడంతోపాటు కొత్త రైళ్లను ప్రవేశ పెట్టాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వేకు జిల్లా నుంచి వినతుల పరంపర మొదలైంది. రైల్వేతోపాటు ఎంపీలకు సైతం విజ్ఞప్తులు వెళ్తున్నాయి. దీంతో జిల్లా ట్రైన్ కనెక్టివిటీపై రైల్వేశాఖ స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది.
మెమూ రేక్ వస్తే
మణుగూరు–కాజీపేట ప్యాసింజర్ రైలును తిరిగి నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే, చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్, సికింద్రాబాద్ నుంచి లిఖిత పూర్వక హామీ లభించింది. ప్రస్తుతం డోర్నకల్ – భద్రాచలంరోడ్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని, ఈ సమయంలో మెమూ (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్, పుష్‌పుల్) నడపడం శ్రేయస్కరమని వెల్లడించారు. రైలు నడిపేందుకు అవసరమైన బోగీల సెట్ (రేక్) కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశామని, రేక్ అందుబాటులోకి వస్తే సర్వీస్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇక బెళగావి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన అంశాలు సౌత్ వెస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి. అక్కడి నిర్ణయాలను బట్టే ఆ రైలు కొనసాగింపు లేదా రద్దు ఉంటుంది.
చర్లపల్లి సర్వేకు హామీ
ప్రతీరోజు రాత్రి మణుగూరు నుంచి సికింద్రాబాద్ కు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైలు ఉదయం 6 గంటలకు మణుగూరు చేరుకుంటుంది. అప్పటి నుంచి రాత్రి 9:45 గంటల వరకు సుమారు పదమూడున్నర గంటలపాటు ఈ రైలు ఖాళీగా ఉంటోంది. ఈ సమయంలో ఈ రైలును మణుగూరు, చర్లపల్లి మధ్య ఇంటర్‌సిటీగా నడిపించాలని దక్షిణ మధ్య రైల్వేకు వినతులు వెళ్లాయి. ఉదయం 5 గంటలకు భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి కాకతీయ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌కు, 6 గంటలకు సింగరేణి ఎక్స్‌ప్రెస్ బల్లార్షాకు వెళ్తున్నాయి. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య మరో రైలును ప్రవేశపెడితే ప్రయాణికుల రద్దీ ఏ మేరకు ఉంటుందనే అంశంపై సర్వే చేపట్టేందుకు రైల్వే అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే మరో చర్లపల్లి ఇంటర్‌సిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కిన్నెరసాని ఎక్స్‌ప్రెస్!
భద్రాచలంరోడ్ నుంచి తిరుపతి, షిర్డీలకు రైలు సర్వీసులు ప్రవేశపెట్టాలనే డిమాండ్ దశాబ్దకాలంగా ఉంది. కానీ రైల్వే నుంచి సానుకూల హామీ రావడం లేదు. తాజాగా భద్రాచలంరోడ్ నుంచి కరీంనగర్/నిజామాబాద్ మార్గంలో రైలు నడిపించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ రైలు అందుబాటులోకి వస్తే భద్రాద్రి జిల్లా నుంచి వేములవాడ, బాసర వంటి పుణ్యక్షేత్రాలకు రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. పదహారేళ్లుగా మణుగూరు సూపర్ ఫాస్ట్‌గా పిలుస్తున్న మణుగూరు–సికింద్రాబాద్ రైలుకు కిన్నెరసాని ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. రైళ్లకు నదుల పేర్లు పెట్టే ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇప్పటికే శబరి, గౌతమి, కృష్ణ, గోదావరి, వైన్‌గంగా, కావేరి, నాగావళి వంటి నదుల పేర్లతో రైళ్లు ఉన్నాయి.
గతంలో రాకపోకలు సాగించి కోవిడ్ సమయంలో రద్దయిన రైళ్లలో మణుగూరు–కాజీపేట ప్యా సింజర్ రైలు ఉంది. ఉదయం 7 గంటలకు మణుగూరులో బయల్దేరే ఈ రైలు భద్రాచలంరోడ్, డోర్నకల్ మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకు కాజీపేటకు చేరుకునేది. తిరుగు ప్రయాణంలో 1 గంటకు అక్కడ బయల్దేరి సాయంత్రం ఐదు గంటలకు మణుగూరు వచ్చే ది. ఈ రైలు రద్దు కావడంతో వరంగల్ – కొత్తగూడెం మధ్య పగటి సమయంలో ట్రైన్ కనెక్టివిటీ లేకుండాపోయింది. కొల్హాపూర్/బెళగావి – భద్రాచలంరోడ్/మణుగూరు రైలు సైతం పగటి వేళ రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉండేది. ఈ రైలును కొన్నాళ్లు నడిపించడం, అకస్మాత్తుగా ఆపేయడం జరుగుతోంది. దీంతో ఈ రెండు రైళ్లను పునరుద్ధరించాలంటూ రైల్వే యూజర్స్, జిల్లా రైల్వే ప్రయాణికుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు, వర్తక సంఘాల నుంచి క్రమం తప్పకుండా వినతులు వెళ్తున్నాయి.


