భద్రత కరువు.. | - | Sakshi
Sakshi News home page

భద్రత కరువు..

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

కొనసాగుతున్న భద్రాచలం

ఆలయ పునరుద్ధరణ పనులు

కొండను పెకలిస్తుండటంతో

రోడ్డుపైకి వస్తున్న బండరాళ్లు

ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు చేయని కాంట్రాక్టర్‌

రాకపోకల సమయంలో

ఆందోళనకు గురవుతున్న భక్తులు

భద్రాచలం: భద్రగిరిలో జరుగుతున్న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల్లో భద్రతా చర్యలు చేపట్టడంలేదు. ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలివిడతగా రూ.200 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో ఆలయాలు, భవనాల నిర్మాణాల కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. దక్షిణం వైపు ఉన్న కుసుమ హరనాథ బాబా ఆలయాన్ని నేలమట్టం చేశారు. వంటశాల భవనాలను తొలగించారు. తొలగింపు పనులు చేపడుతున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. కార్మికుల రక్షణకు కూడా నిబంధనలు పాటించలేదనే విమర్శలు వచ్చాయి. కాగా, రామాలయ దర్శనానికి వచ్చిన ఓ పోలీస్‌ ఉన్నతాధికారి గమనించి హెచ్చరించడంతో కార్మికులకు హెల్మెట్‌, తదితర సామగ్రిని అందించారు.

కమిటీ నిర్ణయం అమలేది?

ఆలయ పునరుద్ధరణ పర్యవేక్షక కమిటీ ఈ నెల 9న భద్రాచలంలో తొలిసారిగా సమావేశమై బారికేడింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం దేవస్థానం ఉత్తర ద్వారం పక్కన మట్టి నమూనా పరీక్ష కోసం జేసీబీ ద్వారా కొండను పెకిలిస్తున్నారు. శనివారం కూడా పనులు కొనసాగాయి. కొండను తొలుస్తుండగా మట్టి పెళ్లలు, పెద్ద రాళ్లు రోడ్లుపైకి వచ్చాయి. మరోవైపు వారాంతపు సెలవు రోజులు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో పని ప్రదేశం వద్ద కాంట్రాక్టర్‌ బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం భక్తులు ఆందోళనకు గురయ్యారు. కనీస రక్షణ, ప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సూచనలను కూడా కాంట్రాక్టర్‌ విస్మరిస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

మట్టి శాంపిళ్ల సేకరణ వేగవంతం

ఆలయ పునరుద్ధణ పనులు క్రమంగా వేగవంతమవుతున్నాయి. తొలుత దక్షిణ భాగం వైపు పనులు ప్రారంభించిన అధికారులు, ఉత్తరం వైపు సైతం ప్రారంభించాలని భావిస్తున్నారు. ఉత్తర ద్వారం, మెట్లను తొలగించి కొత్త ద్వారం, వేదిక పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మట్టి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. శాంపిళ్లను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపి రిపోర్టు వచ్చాక పనులు చేపట్టే అవకాశం ఉంది. చిత్రకూట మండపం కూడా తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోని బాపు చిత్రాలను ఒక్కోటిగా తరలిస్తున్నారు. మండపంలో అద్భుతంగా, రమణీయంగా ఉన్న శిల్పాలు దెబ్బతినకుండా స్తంభాలను తొలగించేందుకు ప్రైవేట్‌ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చలు ముగిసి ఒప్పందం జరిగితే చిత్రకూట మండప తొలగింపు పనులు కూడా ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement