జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందిన సంఘటనపై గురువారం పోలీసులు కేసు మోదు చేశారు. ఏఎస్సై డి.వెంకట సుబ్బారావు కథనం ప్రకారం.. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ కొండి కశ్యపు(51) తీవ్రంగా గాయపడింది. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక స్థోమత లేక ఆమె ను భర్త ప్రైవేట్ ఆస్పత్రి నుంచి తీసుకెళ్లి ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి భర్త నాగ్ సుకుదేవ్ ఫిర్యాదుతో పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణమైన, అనంతారం గ్రామానికి చెందిన పూనెం చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు.
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గర్భిణి..
భద్రాచలంఅర్బన్: భద్రాచలంఏరియా ఆస్పత్రిలో గురువారం ఉదయం 24 వారా ల గర్భిణి మృతి చెందింది. బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురానికి చెందిన గర్భిణి బుల్లెమ్మ (26) హెల్ప్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ ఈ నెల 9న ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. ఈ క్రమంలో 11న బాధితురాలికి బీపీ పెరిగి నోటి నుంచి రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.
జ్వరంతో జేఎన్‌టీయూ విద్యార్థిని..
మణుగూరు టౌన్: మండలంలోని చాకలి ఐలమ్మనగర్‌కు చెందిన రాపర్తి అనూష(22) అనారోగ్యంతో హైదరాబాద్‌లో గురువారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో అనూష బీటెక్ చదువుతుండగా టైఫాయిడ్ జ్వరంతో 40 రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. వారం రోజుల క్రితం బ్రెయిన్ ట్యూమర్ కూడా రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. చదువులో ముందుండే అనూష మృతితో ఐలమ్మనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబం కావడంతో మేము సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు.
వరుస చోరీలతో భయాందోళన
ఇల్లెందురూరల్: మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ఒకే రోజు సుభాష్‌నగర్, సంజయ్‌నగర్ గ్రామాల్లో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. సుభాష్‌నగర్‌లోని సరికొండ గోప య్య, సంజయ్‌నగర్‌లో జానీమియా ఇద్దరు ఊరికి వెళ్లడంతో రాత్రి సమయంలో దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.20వేలు నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అదృశ్యం
ములకలపల్లి: వివాహిత అదృశ్యమైన ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదుచేశారు. ఎస్సైమధుప్రసాద్ కథనంప్రకారం.. మండలంలోని నల్లివారిగూడెం గ్రామానికి చెందిన మెహరీనా, భర్త మీరాతో కలిసి జీవనం సాగిస్తోంది. గత ఫిబ్రవరి 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన మెహరీనా తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


