పాల్వంచరూరల్: పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. యానంబైల్, ఉల్వనూరు, కిన్నెరసాని గ్రామాల పరిధిలోని విద్యార్థులకు ఇక్కడి కేంద్రం కేటాయించారు. 220 మంది విద్యార్థులను కేటా యించగా దూరాభారం కావడంతో అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. పాల్వంచ మండలంలోని పాండురంగాపురం హైస్కూల్లో 32 మంది విద్యార్థులు ఉండగా, వీరికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని బూర్గంపాడు మండలం ఉప్పుసాక స్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. నాగారం హైస్కూల్లో 35 మంది, జగన్నాథపురం హైస్కూల్‌లో 45 మంది విద్యార్థులు ఉండగా, వీరికి పాల్వంచ పట్టణంలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పునుకుల గ్రామంలో పదో తరగతి విద్యార్థులు 12 మంది ఉండగా, ఐదు కిలోమీటర్ల దూరంలోని కిన్నెరసాని వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరో వైపు కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆటోల ద్వారా పరీక్షలకు పంపాల్సి వస్తుందని, ప్రభుత్వం స్పందించి కనీసం వాహన సౌకర్యమైనా కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా రేపటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
ఈఏడాది కూడా దూరంగా
పరీక్ష కేంద్రాల కేటాయింపు


