సరికొత్త కళ ! | - | Sakshi
Sakshi News home page

సరికొత్త కళ !

Mar 6 2026 8:23 AM | Updated on Mar 6 2026 8:23 AM

మూడు గనుల కలయిక..

రేపు ప్రారంభించనున్న సింగరేణి సీఎండీ

గని జీవితకాలం 35 ఏళ్లు..

కొత్తగూడెంలో మళ్లీ కనిపించనున్న కార్మిక సందడి

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కళ తప్పిన కొత్తగూడెం ఏరియాకు మళ్లీ జీవం రానుంది. మూడేళ్లుగా ఊరిస్తున్న వెంకటేశ్‌ఖని మెగా ఓపెన్‌ కాస్ట్‌ కమ్‌ అండర్‌ గ్రౌండ్‌ మైన్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి అధికారికంగా మొదలవబోతోంది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అవసరమైన చర్యలు చేపడుతోంది.

రెండేళ్లుగా ఎదురుచూపులు

గతంలో మూతబడిన వెంకటేశ్‌ఖని (వీకే) భూగర్భ గని, గౌతంఖని ఓపెన్‌కాస్ట్‌ మైన్‌లను ప్రస్తుతం నడుస్తున్న పద్మావతి భూగర్భ గనితో అనుసంధానం చేస్తూ వెంకటేశ్‌ఖని మెగా ఓపెన్‌కాస్ట్‌ కమ్‌ అండర్‌గ్రౌండ్‌ మైన్‌ ప్రాజెక్టును చేపట్టాలని సింగరేణి 2021లో నిర్ణయించింది. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం ఈ గని నుంచి 2024 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలి. కానీ పర్యావరణ అనుమతులు, సాంకేతిక చిక్కుల కారణంగా గత రెండేళ్లుగా మొదలు కాలేదు. ఎట్టకేలకు గతేడాది నవంబర్‌ నుంచి ఈ గనిలో పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మార్చి మొదటి వారం వరకు నిర్విరామంగా ఉపరితలంలో మట్టిని (ఓవర్‌ బర్డెన్‌)ని తొలగిస్తూ రాగా, ఇటీవల బొగ్గు నిల్వలు వెలుగు చూశాయి.

35 ఏళ్ల పాటు ఉత్పత్తి..

వీకే మెగా ఓసీలో 317 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కనీసం 190 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు వెలికి తీసే అవకాశముంది. ఇక్కడ లభించే బొగ్గు సబ్‌బిటుమినస్‌ రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ బొగ్గును థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో ఎక్కువగా వినియోగిస్తారు. సాలీనా ఈ బొగ్గు గని నుంచి 6.30 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇందులో 5.30 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఓసీ విధానంలో, ఒక మిలియన్‌ మెట్రిక్‌ టన్ను బొగ్గును అండర్‌గ్రౌండ్‌ నుంచి వెలికి తీస్తారు. ఇక్కడ 2,403 హెక్టార్ల పరిధిలో బొగ్గును వెలికి తీసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొత్త బొగ్గు గని అందుబాటులోకి రానుండడంతో కార్మికులతో కొత్తగూడెం మళ్లీ కళకళలాడనుంది. ఈ గని జీవిత కాలం 35 ఏళ్లు ఉండనుంది. వెయ్యి మంది పర్మనెంట్‌, అంతే సంఖ్యలో కాంట్రాక్ట్‌ కార్మికులు గని పనుల్లో బిజీ కానున్నారు.

వరుసగా మూతబడిన గనులు

దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కొత్తగూడెంలో సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీస్తోంది. ఈ క్రమంలో వెంకటేశ్‌ ఖని(వీకే)ని 1954లో ప్రారంభించింది. ఈ గని పరిధిలోకి వచ్చే భూభాగం అడుగున 300 మీటర్ల కంటే లోతులో నిల్వ ఉన్న బొగ్గును ఇక్కడ దశాబ్దాల తరబడి తవ్వి తీశారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోవడంతో 2021లో మూసేశారు. ఈ గనికి ఒక వైపున పద్మావతిఖని –5 పేరుతో 1991లో భూగర్భ గనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 అడుగుల కంటే దిగువన భూగర్భంలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. వెంకటేశ్‌ ఖనికి మరోవైపున గౌతంఖని పేరుతో ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ను 1991లోనే మొదలుపెట్టారు. భూ ఉపరితలం నుంచి 300 అడుగుల లోతు వరకు ఉన్న బొగ్గును వెలికి తీశారు. నిల్వలు అడుగంటి పోవడంతో ఈ గని 2021లోనే మూత పడింది. ఇప్పుడు ఈ మూడు గనులను కలుపుతూ వెంకటేశ్‌ఖని మెగా ఓపెన్‌ కాస్ట్‌ కమ్‌ అండర్‌ గ్రౌండ్‌ మైన్‌ అందుబాటులోకి రానుంది.

భూ ఉపరితలం నుంచి 300 నుంచి 450 అడుగుల లోతులో ఉన్న బొగ్గునే వీకే 7 గని ద్వారా దాదాపు 65 ఏళ్లకు పైగా వెలికి తీశారు. కానీ 300 అడుగుల పైన కూడా భారీ స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వీకే భూగర్భ గని పై భాగంలో ఉన్న బొగ్గు నిల్వలను ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ ద్వారా వెలికితీస్తారు. ఇక్కడ బొగ్గు నిల్వ ల కోసం తీసే ఓవర్‌ బర్డెన్‌ మట్టితో గతంలోనే మూతపడిన గౌతంఖని ఓపెన్‌ కాస్ట్‌లో ఏర్పడిన ఖాళీలను(గుంతలు) పూరిస్తారు. ప్రస్తుతం ఇండిపెండెంట్‌ గనిగా కొనసాగుతున్న పద్మావతి భూగర్భ గనిని కూడా వీకే పరిధిలోకి తీసుకొస్తారు. పద్మావతి ఖనిలో బొగ్గు ఉత్పత్తి 2030 వరకు జరగనుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఓపెన్‌ కాస్ట్‌ పద్ధతిలో బొగ్గు వెలికి తీయనున్నారు. కాగా, కొత్తగూడెం ఏరియా జీఎం శాలేంరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వీకే 7 మెగా ఓసీలో బొగ్గు ఉత్పత్తిని శనివారం ఉదయం 8 గంటలకు సంస్థ సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పీవీకే అండర్‌ గ్రౌండ్‌ మైన్‌ను పరిశీలిస్తారని చెప్పారు.

బొగ్గు ఉత్పత్తికి సిద్ధమైన వెంకటేశ్‌ ఖని మెగా ఓసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement