జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి రాజేందర్ వెల్లడి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ మహిళా దినోత్సవం, సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకుని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అవగాహన పెంచే లక్ష్యంతో ‘ఫ్రేమ్స్ ఆఫ్ జస్టిస్’ పేరుతో రీల్, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నామని, యువత, న్యాయశాస్త్ర విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచడంతో పాటు చట్టంపై అవగాహన కల్పించడమే పోటీల ఉద్దేశమని పేర్కొన్నారు. రీల్ / వర్టికల్ వీడియో గరిష్టంగా 90 సెకన్లు ఉండాలని, షార్ట్ ఫిల్మ్ /ఎక్స్‌ప్లెయినర్ వీడియో గరిష్టంగా 180 సెకన్లు ఉండాలని సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీల్లో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు అర్హులని, ఏదైనా ప్రాంతీయ భాషలో వీడియోలు ఉండాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలో చేసే వీడియోలకు తప్పనిసరిగా ఇంగ్లిష్/హిందీలో సబ్‌టైటిల్స్ ఉండాలన్నారు. జోన్ల వారీగా విజేతలను ప్రకటించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని, మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ. 5 వేలు ఉంటుందని వివరించారు. ఎంట్రీలను తమ కాలేజీల ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పంపించాలని తెలిపారు. వివరాలకు 95058 02249 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్‌లో ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు https://kothagudem. docourts. gov.in వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు.
మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి
మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మెప్మా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ కోసం దేశంలో పటిష్టమైన చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు, సఖి టీమ్ సోషియో కౌన్సిలర్ బి.రాజమణి, పారా లీగల్ వలంటీర్ భారతి, రూప తదితరులు పాల్గొన్నారు.


