భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ వెలికితీత,
ప్రోత్సాహానికి పరీక్షలు
భద్రాచలం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీయడంతో పాటు ప్రోత్సహించేందుకు ముందస్తు పరీక్షలు దోహదపడతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని ఏజీహెచ్‌ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఆందోళనకు గురికాకుండా వార్షిక పరీక్షలు రాసేలా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 89 గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో 395 మంది పరీక్షలు రాశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీడీ అశోక్, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
శిక్షణతో జీవనోపాధి పొందాలి
నిరుద్యోగ గిరిజన యువతకు ఐటీడీఏ వైటీసీ ద్వారా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పొందాలని రాహుల్ సూచిచారు. ఎలక్ట్రానిక్ విభాగంలో శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. అభ్యర్థులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే అవకాశముండగా.. మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. ఆ తర్వాత పీఓ గిరిజన మాల్ పనులను పరిశీలించారు. ఏపీఓ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ, శిక్షకురాలు భవాని, ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేష్, వార్డెన్ దీనాకుమారి పాల్గొన్నారు.


