కొలువుదీరేది నేడే..
● ప్రమాణ స్వీకారం చేయనున్న కార్పొరేషన్ నూతన పాలకవర్గం ● మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ ● కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఐదుగురు స్వతంత్రులు ● పాత కౌన్సిల్ హాల్‌లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు, తొలుత సీపీఐ, తర్వాత కాంగ్రెస్ తీసుకునేలా శనివారం ఒప్పందం జరిగిన విషయం విదితమే. ఇరు పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను ఆదివారం వరకు ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మేయర్ ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా సీపీఐ నుంచి గెలిచిన కొత్తగూడెం 52వ డివిజన్ కార్పొరేటర్ బాణోత్ కళావతి, పాల్వంచ 31వ డివిజన్ కార్పొరేటర్ నూనవత్ శ్యామల, సుజాతనగర్ 20వ డివిజన్ కార్పొరేటర్ మూడ్ గణేష్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఇక కాంగ్రెస్‌కు మేయర్ సీటు లేకపోవడంతో ఆ పార్టీలోని ఆశావహులు డిప్యూటీ మేయర్ పదవైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హస్తం పార్టీ కూడా డిప్యూటీ మేయర్ ఎవరనేది ప్రకటించలేదు. అన్ని సామాజిక వర్గాల నుంచి ఆశావహులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కాగా కార్పొరేటర్లతో ప్రమాణం స్వీకారం చేయించాక ప్రిసైడింగ్ అధికారులు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు
సిద్ధమైన కార్యాలయం
మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ 22, బీఆర్‌ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం1, సీపీఐ 22, స్వతంత్రులు ఆరు సీట్ల చొప్పున కై వసం చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొలి సారి ఖాతా తెరువగా, విజేతల్లో యువత ఎక్కువగా ఉంది. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన వారు కూడా ఉన్నారు. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన హాల్‌నే అధికారులు ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేస్తున్నారు. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసినా కార్యాలయం బోర్డు మార్చడం తప్ప ఇతర విస్తరణ పనులు ఏమీ చేపట్టలేదు. దీంతో పాత కౌన్సిల్ హాల్‌లోనే సోమవారం కార్పొరేషన్ తొలి పాలకవర్గం కొలువుదీరనుంది.
క్యాంపుల నుంచి వచ్చేసిన
కొందరు కార్పొరేటర్లు
కాంగ్రెస్, సీపీఐలకు సమానంగా సీట్లు రావడంతో ఫలితాలు వెల్లడించిన రోజు రాత్రే ఆయా పార్టీలు తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించాయి. శనివారం రాత్రి మేయర్ పదవిపై కాంగ్రెస్, సీపీఐ మధ్య ఒప్పందం కుదరడంతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో చాలా మంది కార్పొరేటర్లు ఆదివారం క్యాంపుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. మిగిలిన కొందరు క్యాంపుల్లోనే ఉన్నట్లు సమాచారం. వారంతా సోమవారం ప్రమాణస్వీకారానికి నేరుగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జాక్‌పాట్ తగులుతుందని అనుకునేలోపే కాంగ్రెస్, సీపీఐ మధ్య ఒప్పందం కుదరడంతో క్యాంపులకు తరలినవారు నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ గూటికి స్వతంత్రులు
స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ కార్పొరేటర్ సీరపు సుగుణ, 13వ డివిజన్ కార్పొరేటర్ తలుగు శాంతా, 34వ డివిజన్ కార్పొరేటర్ బట్టు విజయలక్ష్మి, 42వ డివిజన్ కార్పొరేటర్ దున్నపోతుల మణి, 48వ డివిజన్ కార్పొరేటర్ ధర్మసోత్ నరేష్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్పొరేటర్లతోపాటు కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కూడా మంత్రిని కలిసి, డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారంపై చర్చలు జరిపినట్లు సమాచారం.
కొలువుదీరేది నేడే..
కొలువుదీరేది నేడే..
కొలువుదీరేది నేడే..


