ఏవీ కమ్యూనిటీ హాళ్లు? | - | Sakshi
Sakshi News home page

ఏవీ కమ్యూనిటీ హాళ్లు?

Feb 16 2026 7:27 AM | Updated on Feb 16 2026 7:27 AM

ఏవీ కమ్యూనిటీ హాళ్లు?

ఏవీ కమ్యూనిటీ హాళ్లు?

భద్రాచలంలో శుభకార్యాలకు

వేదికలు కరువు

ఫంక్షన్‌ హాళ్ల అద్దె అధికంగా

ఉండటంతో ఆర్థిక భారం

ప్రైవేటు కంపెనీలు ఉన్నా

సామాజిక బాధ్యత అంతంతే..

ప్రభుత్వం అలసత్వం వీడాలని స్థానికుల వేడుకోలు

భద్రాచలం:అధిక జనాభా కలిగి ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న భద్రాచలంలో కమ్యూనిటీ హాళ్లు కరువయ్యాయి. పేద, మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు నిర్వహించాలంటే ఫంక్షన్‌ హాళ్ల అద్దె చెల్లించలేక బెంబేలెత్తిపోతున్నారు. భక్తులకు తగినట్లుగా దేవస్థానం ఆధ్వర్యంలో సైతం వేదిక లేదు.

ఫంక్షన్‌ హాళ్లకు డిమాండ్‌

ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్‌ హాళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఏసీ, నాన్‌ ఏసీ ఫంక్షన్‌ హాళ్లు రాజ్యమేలుతున్నాయి. వేడుకలు, రోజుల డిమాండ్‌ను బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు పెళ్లి ఖర్చులో సగభాగం ఇందుకే వెచ్చించాల్సి వస్తోంది. శుభకార్యాలు అధికంగా ఉండే సమయంలో మూడు నెలల ముందుగానే అడ్వాన్స్‌ చెల్లించి, వారు అడిగినంత అద్దె ఇస్తూ బుకింగ్‌ చేసుకుంటున్నారు.

భద్రగిరిలో కలగానే కమ్యూనిటీ హాళ్లు

భద్రాచలంలో ప్రస్తుతం సుమారు లక్ష వరకు జనాభా ఉంది. రోజురోజుకూ జనాభా పెరుగుతున్నా కమ్యూనిటీ హాల్స్‌ మాత్రం అందుబాటులోకి రావడం లేదు. దశాబ్దాల నుంచి పోరాడగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. కొద్ది మేర నిర్మాణం చేశాక బిల్లులు చెల్లించలేదనే సాకుతో పనులు ఆపేశారు. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి చెత్తా చెదారం పేరుకుపోతోంది. ముస్లింల కోసం కేటాయించిన షాదీఖానా బందెల దొడ్డిని తలపిస్తోంది. పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో వినియోగంలో లేదు. ముస్లింల శుభకార్యాలకు సైతం వేదిక లేకుండా పోయింది. ప్రస్తుతం భద్రాచలంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని కూడా నేటి ట్రెండ్‌కు తగినట్లు ఆధునికీకరించాలని గిరిజనులు కోరుతున్నారు.

ఐటీసీ నిధులతో నిర్మించాలి..

ప్రజలకు వసతులను కల్పించటంలో ప్రభుత్వ అలసత్వంపై విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీలకు కొదవ లేదు. చెంతనే ఉన్న ఐటీసీ సారపాకలో మాత్రమే చిన్న ఫంక్షన్‌ హాల్‌ నిర్మించింది. ఐటీసీ నిధులతో భద్రాచలంలో కూడా మల్టీ పర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని, ఇందుకోసం ఉమ్మడి జిల్లా మంత్రులు, కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా స్థలం కేటాయించి బహుళ అంతస్తుల కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం నుంచి సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని భక్తులు కోరుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రాములవారి క్షేత్రంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. వారి అవసరాలకు తగినట్లు తగిన వేదిక నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement