నిలిచిన సింగరేణి స్కూల్ బస్సులు
● రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
రుద్రంపూర్: సింగరేణి స్కూల్ బస్సులు సుమారు 15 రోజులుగా నిలిచిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. సింగరేణి సంస్థ 1974 నుంచి విద్యాసంస్థలు నిర్వహిస్తోంది. విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగించేందుకు అనువుగా బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి యాజమాన్యం సింగరేణి బస్సులను నిలిపివేసి టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ బస్సులు నడిపిస్తుండగా, యాజమాన్యం చెల్లింపులు చేస్తోంది. అయితే సదరు కాంట్రాక్టర్ కిస్తీలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ బస్సులను లాక్కెళ్లింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో బస్సులు లేక కొందరు విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ జీఎం వెంకటాచారిని వివరణ కోరగా.. టెండర్ నిబంధనలు పాటించని కారణంగా సదరు కాంట్రాక్టర్‌కు ఫైన్ వేయడంతోపాటు బ్లాక్ లిస్టులో పెడతామని తెలిపారు. మరో టెండర్‌ను కాల్‌ఫర్ చేస్తామని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా
రాజేష్ యాదవ్
అశ్వాపురం : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బొల్లినేని రాజేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రిగా అరుణ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ బీసీల హక్కులు, సంక్షేమం కోసం పాటుపడతానని, సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని అన్నారు. రాజేష్ యాదవ్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఐటీసీలో కార్మికుడికి తీవ్రగాయాలు
బూర్గంపాడు: విధి నిర్వహణలో ఉన్న ఐటీసీ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం ఐటీసీ పీఎస్‌పీడీలో జరిగింది. ఐటీసీ పీఎస్‌పీడీలోని షిప్పర్ హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రాచలానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు ఎస్.శ్రీనివాస్ కన్వేయర్ బెల్ట్‌లో పడిపోయాడు. దీంతో అతని కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం అందించేందుకు ట్రేడ్ యూనియన్ నాయకులు చర్యలు తీసుకున్నారు.
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. తల్లి మరణానంతరం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూ. 8 లక్షల నగదు పంపకంలో మణుగూరుకు చెందిన మహ్మద్ మహబూబ్ బాషా కుటుంబంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బాషా సోదరుడు మహ్మద్ ఇబ్రహీం కక్ష పెంచుకుని 2020, ఆగస్టు 8న బాషా భార్య హబీబిని కత్తి నరికి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. 15 మంది సాక్షులను విచారించగా, మహ్మద్ ఇబ్రహీంపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పీవీడీ లక్ష్మి ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. మణుగూరు ఎస్‌హెచ్‌ఓ పి.నాగబాబు, సిబ్బంది డి.రాఘవయ్య, ఎన్.వీరబాబు, అశోక్ సహకరించారు.
పీఏసీఎస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పీఏసీఎస్ ఉద్యోగి తడిక సదానందం గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రోజూలాగే గురువారం ఉదయం విధులకు హాజరైన సదానందం కొద్దిసేపటికే పురుగుల మందు తాగి ఇంటికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
పాల్వంచరూరల్: రోడ్డు ప్రమాదంలో వాహనదారుడికి తీవ్రగాయాలైన ఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన లచ్చు ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా యానంబైల్ సమీపంలో మరో ద్విచక్రవాహదారుడు అడ్డుగా వచ్చాడు. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోగా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమ్తితం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.


