తొలి బ్యాచ్‌లో సీటు.. అదృష్టం
మైనింగ్‌లో జాయిన్ అయ్యా
● తల్లిదండ్రుల త్యాగాలను వృథా కానివ్వొద్దు ● ‘ఎర్త్ సైన్స్’ ఓరియంటేషన్‌లో కలెక్టర్ పాటిల్
కొత్తగూడెంఅర్బన్: తల్లిదండ్రుల త్యాగాలను నిత్యం గుర్తుచేసుకుంటూ వారి కష్టం వృథా కాకుండా విద్యార్థులు చదవాలని.. తద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తొలి బ్యాచ్ ఇంజనీరింగ్, బీఎస్సీ విద్యార్థులకు శుక్రవారం ఓరియెంటేషన్ ఏర్పాటుచేశారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రామచంద్ర, జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్ల లను ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు పంపేందుకు ఆందోళన చెందుతారని తెలిపారు. కానీ ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చదివేలా యూనివర్సిటీలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా శ్రద్ధగా చదవాలని సూచించారు. తాను చదివే సమయాన సరైన సౌకర్యాలు లేక కి.మీ. నడిచే వెళ్లేవాళ్లమని.. అయినా మంచి ఉపాధ్యాయులు, ల్యాబ్ సౌకర్యాలు ఉండడంతో ఈ స్థాయికి చేరానని తెలిపారు. జిల్లాలో బొగ్గు గనులు, భారజల కర్మాగారం వంటివి ఉన్నందున ఇక్కడ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేశారని, ఫలితంగా విద్యార్థులు ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తూ చదువు పూర్తిచేయొచ్చని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్‌రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాము, ప్రొఫెసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తొలి బ్యాచ్‌లో సీటు రావడం అదృష్టంగా భావిస్తున్నా. యూనివర్సిటీతో పాటు తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా విద్యనభ్యసిస్తా. కలెక్టర్ ప్రసంగం మాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. – విసెష్, హైదరాబాద్
బొగ్గుగనుల ప్రాంతంలో పెరగడం వల్ల మైనింగ్ కోర్సుపై మక్కువ పెరిగింది. అందుకే మైనింగ్ విభాగంలో సీటు ఎంచుకున్నా. మైనింగ్ కోర్సు పూర్తి చేసి సింగరేణిలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – శివమల్లిక, మంచిర్యాల
కష్టపడి చదివితేనే లక్ష్యసాధన
కష్టపడి చదివితేనే లక్ష్యసాధన