
ఏటీసీలతో నైపుణ్యాలు మెరుగు
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి
బూర్గంపాడు: యువతలో వృత్తి విద్యా నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు(ఏటీసీ) ఉపయోగపడతాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కృష్ణసాగర్ ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేసిన ఏటీసీని గురువారం ఆయన పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఏటీసీలో శిక్షణ పొంది నైపుణ్యాలు పెంచుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌బోర్డులను, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏటీసీల్లో పలు ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుల్లో చేరి వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ వైద్యాధికారులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. రక్త పరీక్ష కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డు, గర్భిణుల వార్డు, మందుల స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. ఇన్ పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులు నిల్వ ఉంచాలని అన్నారు. పేషెంట్లకు శుచికరమైన, బలవర్ధకమైన ఆహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు.