‘ఉపాధి’కి వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి వేళాయె..

Aug 22 2025 3:26 AM | Updated on Aug 22 2025 3:26 AM

‘ఉపాధ

‘ఉపాధి’కి వేళాయె..

ప్రజలకు మేలు జరిగేలా

జిల్లాలో 4.53 లక్షల మంది కూలీలు..

గ్రామాల్లో ఈజీఎస్‌ పనులకు నేడు శ్రీకారం

ప్రారంభించనున్న స్థానిక ఎమ్మెల్యేలు

ప్రజలకు మేలు జరిగే పనులకు స్థానం

ఏర్పాట్లు చేసిన డీఆర్‌డీఏ అధికారులు

చుంచుపల్లి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెల్లో నివసించే పేదలకు 100 రోజులు పని కల్పిస్తూ ఆర్థిక భరోసా నింపుతుండగా.. పనులు సకాలంలో పూర్తి చేసే బాధ్యతను సంబంధిత అధికారులు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనుల జాతర పేరుతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు అన్ని గ్రామాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ఏకకాలంలో పనులు ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలు పనుల్లో భాగస్వాములు కానున్నాయి. చేపట్టనున్న పనులు, కూలీల పని దినాలు, బడ్జెట్‌ కేటాయింపు ప్రణాళికలను డీఆర్‌డీఏ అధికారులు సిద్ధం చేశారు.

అందరికీ ఉపయోగపడేలా..

ప్రభుత్వం నిర్వహిస్తున్న పనుల జాతర కార్యక్రమంలో ప్రధానంగా ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ముఖ్యంగా పశువుల షెడ్లు, కోళ్ల ఫారాలు, వర్మీ కంపోస్టు తయారీ పనులు, నర్సరీలు, నాడెపు కంపోస్టు పిట్‌, అజోలా తయారీ, ఇంకుడు గుంతలు, జలనిధి ద్వారా చెక్‌ డ్యాంల నిర్మాణం, వ్యవసాయ బావులు, వర్షం నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు, బిందు సేద్యం, ఫామ్‌పాండ్స్‌, గతంలో నిర్మించిన రోడ్లు దెబ్బ తింటే మరమ్మతులు వంటివి చేపట్టనున్నారు. అంతేకాక పొలాల వద్దకు ఉన్న కాలిబాటలను అభివృద్ధి చేయడంతో రైతులకు మేలు జరగనుంది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పనులు గుర్తించిన అధికారులు.. ఉపాధి హామీ నిధుల ద్వారా త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తున్నారు. పనుల జాతరలో చేపట్టనున్న ఉపాధి పనులన్నీ 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక శుక్రవారం జరిగే పనుల జాతర కార్యక్రమంలో ఆర్థిక సంవత్సరంలో కొత్తగా చేపట్టబోయే నూతన భవన నిర్మాణాలు, ప్లాస్టిక్‌ వేస్ట్‌ యూనిట్‌, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన పనులుంటే ప్రారంభోత్సవాలు చేస్తారు. జిల్లాలో మొత్తం 4,002 పనులకు రూ.3779.72 లక్షలు కేటాయించారు. దాంతో పాటు గతేడాది ఎక్కువ రోజులు పని దినాలు పూర్తి చేసిన దివ్యాంగులు, నిబద్ధతతో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులను, పచ్చదనం పెంపునకు కృషి చేసిన వారిని సన్మానించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలో పనుల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఆ రోజున స్థానిక ఎమ్మెల్యేలతో కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. పనుల జాతరలో గ్రామస్తులు, రైతులకు మేలు జరిగేలా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కూలీలకు చేతి నిండా పని కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయి.

– ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ

జిల్లా వ్యాప్తంగా 2.21 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, వాటి పరిధిలో 4.53లక్షల మంది కూలీలు పేరు నమోదు చేసుకున్నారు. పనుల జాతరలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో 26.21 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 23.75 లక్షల పని దినాలు పూర్తి చేశారు. ఇప్పటివరకు చేపట్టిన పనులకు రూ.91.10 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు జరిగే పనులను ఉపాధి కూలీలు ఎక్కువ సంఖ్యలో సద్వినియోగం చేసుకుంటారు.

‘ఉపాధి’కి వేళాయె..1
1/1

‘ఉపాధి’కి వేళాయె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement