
గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలి
భద్రాచలంఅర్బన్ : గోదావరి తీర ప్రాంతాలకు చెందిన గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి సిబ్బందికి సూచించారు. వరద ఉధృతి నేపథ్యంలో హైరిస్క్ ఉండే గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే 20 మంది గర్భిణులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రత్యేక వార్డులో వైద్యం అందిస్తున్నారు. వీరిలో భద్రాచలం నుంచి 15 మంది, మణుగూరు, చర్ల నుంచి ఐదుగురు ఉన్నారు. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ గురువారం వారిని పరామర్శించి, అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. చికిత్స సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే తనను సంప్రదించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే వైద్యులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రి నుంచి ఎవరూ ఇళ్లకు వెళ్లొద్దని గర్భిణులకు, వారి కుటుంబసభ్యులకు సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చైతన్య, ఏరియా ఆస్పత్రి సిబ్బంది రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి