
మూడేళ్లయినా ముడిపడలే..
2022లో 71 అడుగుల మేర గోదావరికి భారీ వరద
నాడు చిగురుటాకుల వణికిన భద్రాద్రి ఏజెన్సీ
వరద ముప్పు తప్పిస్తామని నాటి సర్కారు హామీలు
అమలుకు నోచని గత, ప్రస్తుత ప్రభుత్వాల వాగ్దానాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరికి వచ్చే వరదలను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత అతిపెద్ద వరద 1986లో నమోదైంది. అప్పుడు 27 లక్షల క్యూసెక్కుల నీరు రాగా భద్రాచలం వద్ద 75.60 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహించింది. ఆ తర్వాత అదే స్థాయి వరద 2022లోనూ వచ్చింది. గోదావరి ఎగువ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావడంతో 71.30 అడుగుల ఎత్తులో 24.43 లక్షల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం వచ్చింది. 2022 జూలై 10 నుంచి 16 వరకు దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జూలై 17న అప్పటి సీఎం కేసీఆర్ పర్యటించారు. భవిష్యత్‌లో మంపు సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు గత ప్రభుత్వ హామీలు కానీ, ప్రస్తుత సర్కారు చేసిన వాగ్దానాలు కానీ అమలుకు నోచుకోలేదు.
కాంటూర్ లెక్కలేవి..?
1986 వరదలతో పోల్చితే 2022లో వచ్చిన వరద తీవ్రత తక్కువ. పైగా భద్రాచలం పట్టణానికి ఏడు కి.మీ. పొడవున కరకట్ట రక్షణ కూడా ఉంది. అయినప్పటికీ పట్టణంలో సగం ప్రాంతం ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోగా వాటి సమీప కాలనీల్లోని ఇళ్లలో వెంటిలేటర్ల వరకు వరద నీరు చేరింది. దీంతో పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి వరద ప్రవాహ తీరులో ఏమైనా మార్పులు వచ్చాయా అని తెలుసుకునేందుకు కాంటూర్ లెవెల్స్‌ను మరోసారి లెక్కించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో అది ఆచరణకు నోచుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరిలో కాంటూర్ లెవల్స్, పోలవరం ముంపు ప్రభావాన్ని అధ్యయనం చేసే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి ఐఐటీ – హైదరాబాద్‌కు అప్పగించారు. ఫిబ్రవరి నాటికి ఈ పని పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ నిపుణుల కమిటీ నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. గతంలో అల్ప పీడనాలు, తుపానుల కారణంగా గోదావరికి భారీ వరదలు వచ్చేవి. కానీ ఇటీవల క్లౌడ్ బరస్ట్‌లతో కూడా వరద ఉప్పొంగుతోంది. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా కాంటూర్ లెవల్స్‌ను లెక్కించడం, అందుకు తగ్గట్టుగా కొత్త ఫ్లడ్ మాన్యువల్‌ను రూపొందించుకోవాల్సిన అవసరముంది.
రాకపోకలకు ఇబ్బంది
గోదావరి వరద రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగుల నుంచి మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరుకునేలోపు బూర్గంపాడు – సారపాక, దుమ్ముగూడెం – భద్రాచలం, కూనవరం – భద్రాచలం మధ్య వరద నీరు ప్రధాన రహదారిపైకి వచ్చి రాకపోకలు నిలిచిపోతాయి. 53 అడుగుల నుంచి వరద పైకి పోయే కొద్దీ ఇతర ప్రాంతాల్లోనూ రాకపోకలు స్తంభించడం పెరుగుతుంది. దీంతో బూర్గంపాడు – సారపాక, చర్ల – భద్రాచలం మధ్య ఉన్న రహదారుల్లో హై లెవల్ వంతెనలు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా.. అది నెరవేరడం లేదు సరికదా కనీసం సాధారణ పనులు కూడా సకాలంలో జరగడం లేదు. దుమ్ముగూడెం – భద్రాచలం మార్గంలో తూరుబాక వద్ద కుంగిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ ఏడాది శ్రీరామనవమి నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అఽధికారులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. చివరకు 45 అడుగుల వరదకే ఈ వంతెన దగ్గర అప్రోచ్ రోడ్ మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఆగుతూ.. సాగుతూ అన్నట్టుగా కరకట్ట పనులు

మూడేళ్లయినా ముడిపడలే..