
నిలకడగా గోదావరి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రం నుంచి నిలకడగా ఉంది. బుధవారం ఒక్కసారిగా పెరగడంతో ఒక్కరోజే మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే. ఇక గురువారం తెల్ల వారుజామున 5 గంటలకు 50 అడుగులు, 7 గంటలకు 50.60 అడుగులు, 10 గంటలకు 51.10 అడుగులకు చేరుకుని, ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సాయంత్రం 4 గంటలకు 51.90 అడుగులుగా నమోదైంది. అప్పటి నుంచి రాత్రి 11 గంటలకు వరకు అదే ప్రవాహం కొనసాగింది.
వీడిన భయాందోళనలు..
గోదావరి నీటిమట్టం బుధవారం భారీగా పెరగడంతో గురువారం కూడా ప్రభావం చూపుతుందని, మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుందని అందరూ భావించారు. తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ సాయంత్రం నుంచి నీటిమట్టం నిలకడగా ఉండడంతో స్థానికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వరద నెమ్మదిగా తగ్గుతుందని, 9 గంటల తర్వాత వేగంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు తగ్గినా మహారాష్ట్రలో ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడి నుంచి వరద ప్రవాహం వారం రోజుల తర్వాత భద్రాచలం చేరుకుంటుందని, అప్పుడే మళ్లీ వరద పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
వరద ఉధృతి పరిశీలన..
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిశీలించారు. స్లూయీస్‌ల పనితీరు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల కారణంగా సీజనల్ వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
వారం తర్వాత మళ్లీ పెరిగే అవకాశం !

నిలకడగా గోదావరి