
ఉప్పొంగిన గోదావరి
ఎగువ నుంచి వరద..
ఒక్కరోజే మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు
ముంపు ప్రజలకు మంత్రి, అధికారుల సూచనలు
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
భ ద్రాచలం బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ప్రమాద దిశగా ప్రవహిస్తోంది. మంగళవారం నెమ్మదిగా పెరిగిన నీటిమట్టం.. అర్ధరాత్రి నుంచి శరవేగంగా పుంజుకుంది. బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక దాటగా, రాత్రి 10.05 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు ముంపు ప్రజలను అప్రమత్తం చేసి, పలు సూచనలు చేశారు.
ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా
ఉండాలి..
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. నది పరీవాహక గ్రామాల్లో నివసించే ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు అవసరవైన వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్.. ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి భద్రాచలంతో పాటు దుమ్మగూడెం మండలంలో పర్యటించారు. తూరుబాక డైవర్షన్ రోడ్డును, భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి క్రమంగా పెరుగుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల వద్దకు వీడియోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దని సూచించారు. వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే పాల్వంచలో 08744 –241950, వాట్సాప్ నంబర్ 93929 19743, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో 79952 68352, సబ్ కలెక్టరేట్‌లో 08743 – 2324444, వాట్సాప్ నంబర్ 93479 10737 కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
గోదావరి ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు తాలిపేరు ప్రాజెక్టు సైతం నిండడంతో ఆ గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదిలారు. దీంతో నది ప్రవాహం శరవేగంగా పెరిగింది. మంగళవారం నెమ్మదిగా పెరిగినా.. అర్ధరాత్రి నుంచి ఊపందుకుంది. బుధవారం ఉదయం 8.15 గంటలకు 43 అడుగులకు చేరడంతో సబ్‌కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10.05 గంటలకు 48 అడుగులు నమోదు కాగా, రెండో ప్రమాద హెచ్చరిక విడుదల చేశారు. కాగా, నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

ఉప్పొంగిన గోదావరి