
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైభవంగా గిరి ప్రదక్షిణ..
శ్రీ రామచంద్రస్వామి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా కొత్తగూడేనికి చెందిన భక్త రామదాసు ట్రస్ట్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం భద్రగిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆలయంలో స్వామి పాద ప్రదక్షిణకు వీలు లేనందున గిరిప్రదక్షిణే సులభ మార్గమని అన్నారు. అనంతరం స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావు దంపతులు, ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబా, భక్తులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి గుడిలో
నేడు రుద్రహోమం
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా గురువారం రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే హోమంలో పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
రేపు బహిరంగ వేలం..
శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ పరిధిలో పలు పనులు అప్పగించేందుకు 22వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. కొత్త, పాత కాంప్లెక్స్‌లోని పలు షాపులే కాక చీరలు పోగు చేసుకోవడం, పూలదండల విక్రయం తదితర పనులకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు రూ.200 చెల్లించి షెడ్యూల్ ఫాం తీసుకుని, ధరావత్తు డీడీ జతపరిచి వేలంలో పాల్గొనాలని సూచించారు.
కిన్నెరసానిని
సందర్శించిన ఎఫ్‌బీఓలు
పాల్వంచరూరల్ : హైదరాబాద్ ధూల్‌పేట ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 40 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు(ఎఫ్‌బీఓ) శిక్షణలో భాగంగా బుధవారం పాల్వంచ మండలంలోని కిన్నెరసాని డీర్‌పార్కును సందర్శించారు. అనంతరం వన్యప్రాణులు, అటవీ సంపద సంరక్షణపై వారికి వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బాబు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అకాడమీ కోర్సు డైరెక్టర్ అశోక్‌కుమార్, స్థానిక వైల్డ్‌లైఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
వైల్డ్‌లైఫ్ సిబ్బందికి కిట్లు..
విధి నిర్వహణలో వైల్డ్‌లైఫ్ సిబ్బంది అటవీ ప్రాంతంలో ఇబ్బంది పడకుండా అత్యవసరంగా వినియోగించుకునే పలు రకాల వస్తువుల కిట్లను కిన్నెరసాని డీర్‌పార్కు వద్ద వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బాబు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 మంది సిబ్బందికి రూ.1.20 లక్షల విలువైన కిట్లను వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అందజేసిందని తెలిపారు. కార్యక్రమంలో రేంజర్ కవితామాధురి, సెక్షన్ అధికారి బి.కిషన్, ఎఫ్‌ఎస్‌ఓ బి.సునీత, కృష్ణయ్య, ఎఫ్‌బీఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం