
వరద ఉధృతి పరిశీలన
భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ జితేష్.వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు. పట్టణ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. నది వద్ద విధుల్లో ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ బృందాలకు పలు సూచనలు చేశారు. అనంతరం దుమ్ముగూడెం మండలం తూరుబాక డైవర్షన్ రోడ్డును తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారని, ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అలాగే వరద నీటితో మునిగిన సున్నంబట్టి – బైరాగులపాడు రహదారిని సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, సీఐ అశోక్, ఎంపీడీఓ వివేక్‌రామ్, ఆర్‌ఐలు కల్లూరి వెంకటేశ్వరరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంత ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల వద్దకు వీడియోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని పేర్కొన్నారు.