
అందని యాసంగి బోనస్
రూ.60వేల బోనస్ రావాలి
ఎప్పుడు జమవుతుందో చెప్పలేం..
● సన్నరకాల ధాన్యం బోనస్ బకాయి రూ.18.34 కోట్లు ● మూడు నెలలుగా ఎదురుచూస్తున్న రైతులు
బూర్గంపాడు: గత యాసంగిలో పండించిన సన్నరకం ధాన్యం విక్రయించి మూడు నెలలు దాటింది. వానాకాలం సీజన్ నాట్లు ముగింపు దశకు చేరాయి. అయినా ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. దీంతో రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గత యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 55,243 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 36,950 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉంది. ప్రభుత్వం మద్దతు ధర సన్నరకాలకు క్వింటాల్‌కు రూ. 2,320లు, దొడ్డురకాలకు రూ.2,300 చెల్లించింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున ఇస్తానని చెప్పిన బోనస్ మాత్రం రైతు ఖాతాల్లో జమ చేయలేదు. జిల్లాలో రూ.18.34కోట్ల బోనస్ బకాయి చెల్లించా ల్సి ఉంది. గత వానాకాలం పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం నూరుశాతం బోనస్ అందించింది. అదే నమ్మకంతో యాసంగిలో కూడా రైతులు సన్నరకం వరిని సాగు చేశారు. దొడ్డు రకాల కంటే సన్నరకాలకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఎరువులు అధికంగా వేయాలి. చీడపీడలు, దోమ నివారణ, పురుగుల నివారణకు అధికంగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఎకరాకు రూ. 8 వేల వరకు అదనపు పెట్టుబడి అవుతుంది. యాసంగిలో సన్నరకాలు ఎకరాకు 35 బస్తాల దిగుబడి వస్తే, దొడ్డురకాలు 40నుంచి 45బస్తాల వరకు దిగుబడి వస్తాయి. అయినా బోనస్ అందిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో రైతులు సన్నరకాలను సాగు చేశారు. దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు రెండేళ్లుగా మందకొడిగా సాగుతుండటం వల్ల కూడా సన్నరకాల వైపు మొగ్గు చూపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన పదిరోజుల్లో నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమైంది. కానీ బోనస్ మాత్రం ఇంతవరకు రాలేదు. ఎప్పుడు ఇస్తారనే విషయమై అధికారుల నుంచీ స్పష్టత లేదు. వానాకాలం వరినాట్లకు ఉపయోపడుతుందని ఆశించిన రైతులు బోనస్ అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
రూ.60వేల బోనస్ రావాలి
యాసంగిలో 120 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం అమ్మినాను. నాకు రూ. 60 వేల బోనస్ రావాలి. వడ్లు అమ్మి వందరోజులు దాటినా బోనస్ పడలేదు. ఆ డబ్బులు వానాకాలం నాట్లకు అక్కరకు వస్తాయనుకున్నాను.
–వెలమ రమేష్, రైతు, మల్లెలమడుగు,
అశ్వాపురం మండలం
ఎప్పుడు జమవుతుందో చెప్పలేం..
యాసంగిలో కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి సంబంధించిన రైతుల బ్యాంకు ఖాతాలను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిర్ణయం మేరకు రైతుల ఖాతాల్లోనే బోనస్ నగదు జమవుతుంది. ఎప్పుడు జమవుతుందో కచ్చితంగా
చెప్పలేం.
–రుక్మిణిదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి