
ఆర్టీసీకి కలిసొచ్చింది..
నాలుగు రోజుల్లో డిపోల వారీగా
ఆదాయం (ప్రత్యేక సర్వీసుల ద్వారా)
నాలుగు రోజుల్లో రూ.1.21 కోట్ల ఆదాయం
అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షలు
ఖమ్మంమయూరిసెంటర్: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వత్రం, రాఖీ పౌర్ణమి రెండో శనివారం.. ఆ తర్వాత ఆదివారం కావడంతో జనమంతా ఊర్ల బాట పట్టడం ఆర్టీసీకి కలిసొచ్చింది. ఈనెల 7నుంచి 10వ తేదీ వరకు ఆర్టీసీ ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల ద్వారా 374 బస్సులు నడిపించారు. ఆ బస్సుల్లో తద్వారా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో కాసుల పంట పండింది.
ప్రణాళికాయుతంగా..
ఈనెల 8న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోగా విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలీడే ఇచ్చారు. ఆ మరుసటి రోజు రాఖీ పండుగ, ఆపై ఆదివారం కలిసొస్తుండడంతో చాలా మంది 7వ తేదీనే సొంత ఊర్లకు పయనమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలకు ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక 9వ తేదీన హైదరాబాద్‌తో పాటు జిల్లాలో రద్దీ ఉన్న ప్రాంతాలకు ని బస్సులను తిప్పారు. అంతేకాక 10వ తేదీ ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యేవారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తూ బస్టాండ్లలో అదనపు సిబ్బంది ద్వారా పర్యవేక్షించడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు.
రద్దీలోనూ మహాలక్ష్మి
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు విపరీతమైన రద్దీలోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేశారు. రక్షా బంధన్ పండుగ రోజు రీజియన్ వ్యాప్తంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 1.50 లక్షల మంది మహిళామణులు ప్రయాణించారు. ఈరోజు మొత్తంగా మొత్తం 2లక్షల మందికి పైగా ప్రయాణికులను రాకపోకలు సాగించారు. ఇక ఆదివారం అదనంగా 137 సర్వీసులు నడింపించారు. కాగా, రీజియన్‌కు రికార్డ్ స్థాయిలో కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారానే రూ.1.21 కోట్ల ఆదాయం నమోదుకాగా.. అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షల ఆదాయం సమకూరింది.
రద్దీకి అనుగుణంగా సర్వీసులు
రాఖీ పండుగ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యాన ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నాం. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని ఉద్యోగులకు సూచనలు చేశాం. డిప్యూటీ ఆర్‌ఎం, డిపో మేనేజర్లతో పాటు నేను కూడా బస్టాండ్లలో పర్యవేక్షిస్తూ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయడంతో ఏ సమస్యా రాలేదు.
– ఏ.సరిరామ్, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్
వరుస సెలవులతో ప్రయాణికుల రద్దీ
నాలుగు రోజుల్లో రూ.1.21 కోట్ల ఆదాయం
అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షలు
నాలుగు రోజుల్లో డిపోల వారీగా ఆదాయం (ప్రత్యేక సర్వీసుల ద్వారా)
డిపో కిలోమీటర్లు ఆదాయం
(రూ.లక్షల్లో)
మధిర 42,316 29.84
భద్రాచలం 42,958 25.81
ఖమ్మం 38,022 20.99
సత్తుపల్లి 26,122 15.58
మణుగూరు 24,096 12.05
కొత్తగూడెం 15,155 9.16
ఇల్లెందు 11,797 7.88
రీజియన్ 2,00,466 121.35

ఆర్టీసీకి కలిసొచ్చింది..

ఆర్టీసీకి కలిసొచ్చింది..