
ఓపెన్ డిగ్రీలో ప్రవేశానికి 13 వరకు అవకాశం
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లిలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో ప్రవేశానికి ఈనెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణచందర్‌రావు, సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, డిప్లొమా రెండు సంవత్సరాల కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచి గిరిజన విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘డబుల్’ ఇల్లు రాలేదని నిరసన
భద్రాచలంఅర్బన్: డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని ఓ మహిళ సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని మనబోతుల చెరువు ప్రాంతంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిరుపేదలకు కేటాయించారని పేర్కొంది. జాబితాలో తన పేరు ఉన్నా ఇల్లు మరొకరికి కేటాయించారని సరిత అనే మహిళ వాపోయింది. సోమవారం పెట్రోల్ బాటిల్‌తో మనబోతుల చెరువు వద్ద ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలిపింది. నిరుపేద అయిన తనకు ఇల్లు ఇవ్వలేదని పేర్కొంది. కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లను రూ.3 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించింది.
కాంట్రాక్ట్ కార్మికుడికి గాయాలు
మణుగూరు టౌన్ : మణుగూరులోని ఓ ఓబీ కంపెనీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుడికి గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. దుర్గా ఓబీ కంపెనీలో పనిచేసే ఆపరేటర్ దినేశ్ కుమార్ ఓబీ లోడ్‌తో వెళ్తుండగా, వాహనం ఒకవైపు ఒరిగి త్రుటిలో ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలు కావడంతో ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడిని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ రాంగోపాల్ పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఓబీ కంపెనీల్లో ప్రమాదాలపై యాజమాన్యం దృష్టి సారించాలని కోరారు.
నాటిక పోటీల్లో విజేత.. ఖరీదైన జైళ్లు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలో నాలుగురోజుల పాటు జరిగిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. కరీంనగర్ చైతన్యభారతి కళాసంస్థ ప్రదర్శించిన ఖరీదైన జైళ్లు, హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ, తాడేపల్లికి చెందిన అరవింద్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన విడాకులు కావాలి నాటికలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం తొమ్మిది నా టికలు ప్రదర్శించగా రంగస్థల నటులు సుబ్బ రాయ శర్మ, మేక రామకృష్ణ, గోవిందరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈమేరకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నాటికలు ప్రదర్శించిన సంస్థలు, ఉత్తమ దర్శకులు, నటులకు బహుమతలు అందజేశారు. నిర్వాహకులు అన్నాబత్తుల సు బ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్‌రావు, దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, వేల్పుల విజేత, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు.