
‘ఇల్‌నెస్’ సెంటర్..!
వెల్‌నెస్ సెంటర్‌పై పట్టింపు కరువు
● వేధిస్తున్న మందుల కొరత ● నామమాత్రపు ఔషధాలతోనే నెట్టుకొస్తున్న వైనం ● ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఈ సెంటర్‌ను కొన్ని నెలలుగా మందుల కొరత వేధిస్తోంది. అవసరమైన మందులు దొరకక ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవసరమైన మందులు దొరకక కొందరు ఆస్పత్రి చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కేవలం ఓపీ సేవలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోజువారీ మాత్రలు కూడా లేక..
వెల్‌నెస్ సెంటర్‌కు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో 40 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో దాదాపు 80 నుంచి 90 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. కొందరు బీపీతో పాటు షుగర్ మాత్రలు రోజూ వేసుకోవాల్సి వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల మందులు వెల్‌నెస్ సెంటర్‌లో ఆరు నెలలుగా అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు ట్రస్ట్ నుంచి మాత్రలు వస్తున్నా ఒకటి, రెండు రోజుల్లోనే అయిపోతున్నాయి.
తాకిడి ఉన్నా పట్టింపు కరువు..
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 200 మంది వెల్‌నెస్ సెంటర్‌కు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇక్కడ జనరల్ మెడిసిస్, ఫిజియోథెరపీ, డెంటల్ తదితర సేవలు అందుతాయి. టెస్టులకు ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, నరాల బలహీనత, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు చికిత్స చేస్తారు. అయితే ఇక్కడ బీ కాంప్లెక్స్, ఇన్సులిన్, థైరాయిడ్, గ్యాస్, జ్వరం, జలుబు, దగ్గు, అస్తమా రోగులకు ఇన్‌హెల్లర్లు అందుబాటులో లేవు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు మందులు దొరక్క నిరాశగా వెనుదిరుగుతున్నారు.
సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి..
ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూత్ర పరీక్షల షాంపిళ్లు తీసుకోవడానికి కనీసం బాత్‌రూమ్‌లు కూడా లేవు. దాని కోసం జనరల్ ఆస్పత్రిలోని బాత్‌రూమ్‌ల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఓపీ, ఇతర విభాగాల్లో కుర్చీలు కూడా లేవు. గదుల్లో కిటికీలకు కర్టన్లు లేక పగటి పూటే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. సెంటర్‌లో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ముగ్గురు ఫార్మసిస్టులకు ఇద్దరు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇద్దరు, నలుగురు స్టాఫ్‌నర్సులకు ఇద్దరు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా పెషెంట్లకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. గైనిక్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సేవలు అందుబాటులో లేక ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. బీపీ మిషన్ మరమ్మతులకు గురి కాగా, పక్కన పెట్టారు. అలాగే 400 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిన ఈ సెంటర్‌లో 150 రకాలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా వెల్‌నెస్ సెంటర్‌కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి బ్రాండెడ్ మందులు సరఫరా అవుతాయి. ఒక్కో రోగి నెలకు సరిపడా మందులు తీసుకెళ్తుంటారు. అవి అందుబాటులో లేక ప్రైవేటు షాపుల్లో డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
మూడు నెలలుగా మందులు లేవు
మూడు నెలలుగా వెల్‌నెస్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా మందులు అందుబాటులో ఉండట్లేదు. ఎప్పుడు వస్తాయనే సమాచారం చెప్పే వారు కూడా లేరు. బీపీ, షుగర్, థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నా. ఈ సెంటర్‌తో ఉపయోగం లేకుండా పోయింది. – ఎ.జయలక్ష్మి, ఖమ్మం
మందుల కొరత వాస్తవమే
వెల్‌నెస్ సెంటర్‌లో మందుల కొరత వాస్తవమే. ట్రస్ట్‌కు ఇండెంట్ పెట్టాం. త్వరలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న మందులతో సేవలు అందిస్తున్నాం. రోగులకు సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. కొంత మేరకు సిబ్బంది కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సౌకర్యాలపై కూడా నివేదిక పంపించాం.
– డాక్టర్ నారాయణమూర్తి,
వెల్‌నెస్ సెంటర్ జనరల్ ఫిజీషియన్

‘ఇల్‌నెస్’ సెంటర్..!

‘ఇల్‌నెస్’ సెంటర్..!