
ఎట్టకేలకు ‘మత్స్య’ ప్రతిపాదనలు
కరీంనగర్ నుంచి స్పాన్ తీసుకొచ్చాం
జిల్లాలో కోటి 20లక్షల చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ కమిషనర్‌గా ఇటీవల ప్రతిపాదనలు పంపాం. కరీంనగర్ నుంచి స్పాన్ తీసుకొచ్చి కిన్నెరసాని ఉత్పత్తి కేంద్రంలో పెంచుతున్నాం. పెరిగాక పంపిణీ చేస్తాం. నీరు త్వరగా ఇంకిపోతున్నందున చిన్న చిన్న చెరువులు, కుంటల్లో ఈసారి చేపపిల్లలను వదలడంలేదు. – ఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ఖాన్,
జిల్లామత్స్యశాఖాధికారి
పాల్వంచరూరల్: ఎట్టకేలకు మత్స్యశాఖ అధికారులు ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రతిపాదనలు రూపొందించారు. ఈసారి 550 చెరువుల్లో కోటి 20 లక్షల చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం జిల్లాలో చిన్న చెరువులు, కుంటల్లో చేపపిల్లల పెంపకం చేపట్టొద్దని మత్స్యశాఖ నిర్ణ యం తీసుకుంది. జిల్లాలో చేపలు పెంచే చెరువులు, కుంటలు 734 ఉండగా, 70 మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఉన్నాయి. వీటిల్లో 3,248 మంది సభ్యలు ఉన్నారు. చేపల పెంపకంపై సుమారు 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే పంపిణీ ప్రక్రియ ఆలస్యం కావడంతో పెద్దగా ఉపయోగం ఉండదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. జిల్లాలో గతేడాది కూడా చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేశారు. కేవలం 86 లక్షల చేప పిల్ల లను మాత్రమే అందించారు. సీజన్ ప్రారంభంలో చెరువుల్లో చేప పిల్లలను వదిలితే 8,9 నెలలు పెరిగి ఆశించిన దిగుబడి లభించేది. ఈ నేపథ్యంలో ఈ సారి చేపపిల్లలకు బదులుగా నగదు ఇవ్వాలని మత్స్యకారులు ఇటీవల హైదరాబాద్‌లో మత్స్యశాఖ కమిషనర్‌ను కలిసి విన్నవించారు. నగదు ఇస్తే తామే కొనుగోలు చేసుకుని చెరువుల్లో వదులుకుంటామని పేర్కొన్నారు.
కిన్నెరసానిలో 12 లక్షల స్పాన్
కిన్నెరసానిలోని మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో 12 లక్షల గుడ్లను(స్పాన్) తెచ్చి వదిలారు. ఇక్కడి నీటి తోట్లలో రెండు నెలలపాటు పెంచి గిరిజన మత్స్యకార సొసైటీలకు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. కేంద్రంలో 20 లక్షల చేప పిల్లల పెంపు సామర్థ్యంతో 13 నీటితోట్లు కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. దీంతో గతేడాది కేవలం 12 లక్షల చేపపిల్లలను మాత్రమే పెంచారు. ఈ సారి కూడా 12 లక్షల స్పాన్‌ను మాత్రమే పోశారు.

ఎట్టకేలకు ‘మత్స్య’ ప్రతిపాదనలు