
హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
టేకులపల్లి: చేతబడి చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన ఘటనలో ఆరుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. టేకులపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ నూనావత్ చంద్రభాను వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఆళ్లపల్లి మండలం పెద్దవెంకటాపురం పంచాయతీ బూసురాయి గుత్తికోయ గుంపునకు చెందిన పొడియం నంద కుమార్తె గంగి అనారోగ్యంతో గత బుధవారం మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మడకం బీడ అలియాస్ రాజు (35) చేతబడి చేయడం వల్లే గంగి మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు అనుమానించారు. రాజును బాలిక మృతదేహం వద్దకు తీసుకొచ్చి పంచాయితీ పెట్టారు. పంచాయితీలో దోషిగా పేర్కొంటూ తాళ్లతో కట్టేసి ఆరుగురు వ్యక్తులు కర్రలతో విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలై రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఛత్తీస్‌గఢ్‌లోని సొంత గ్రామాలకు వెళ్తుండగా నిఘా పెట్టిన సీఐ బత్తుల సత్యనారాయణ, ఆళ్లపల్లి ఎస్‌ఐ ఎం.సోమేశ్వర్ శనివారం పెద్ద వెంకటాపురం ప్రైమరీ స్కూల్ వద్ద పట్టుకున్నారు. మడవి రాజు, మొక్కటి చిన్నసోమయ్య, మొక్కటి భీమయ్య, వంజం గంగ, నందం జోగ, మొక్కటి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. చేతబడి, బాణామతి వంటి మూఢ నమ్మకాలతో దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ చంద్రభాను