
లౌకిక తత్వంపై మాట్లాడితే సస్పెన్షనా?
ఖమ్మంమయూరిసెంటర్ : ఎస్‌ఎఫ్‌ఐ ఓ విశ్వవిద్యాలయం వంటిదని సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందూత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని, లౌకికతత్వంపై మాట్లాడితే రీసెర్చ్ స్కాలర్ రాందాస్‌పై రెండేళ్ల పాటు యూనివర్సిటీ నుంచి బహిష్కరించిందని ఆరోపించారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు సాగిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నితీష్ నారాయణ్ మాట్లాడుతూ.. ధనిక, ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా శ్రమజీవుల పక్షాన తమ సంఘం నిలబడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ హెచ్‌సీయూ భూములను కాజేస్తోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ దేశానికి ఎంతోమంది నిష్ణాతులను ఇచ్చిందని, జై భీమ్ చిత్ర ఇతివృత్తానికి సంబంధించిన జస్టిస్ చంద్రు ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన వారే కావడం గర్వకారణమని అన్నారు. త్యాగధనులు పుట్టిన గడ్డ ఖమ్మంలో మహాసభలు జరగడం హర్షణీయమని అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో జ్యోతిష్యం, మూఢ విశ్వాసాలను చొప్పించి పాఠ్య పుస్తకాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కోయ చంద్రమోహన్, ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.