హాస్టళ్లు, పాఠశాలలు సిద్ధంగా ఉండాలి
● నెలరోజుల్లో మరమ్మతులు పూర్తిచేయాలి ● ఐటీడీఏ పీఓ బి.రాహుల్
భధ్రాచలం: వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్లు, పాఠశాలల్లోని మేజర్, మైనర్ మరమ్మతులను పూర్తి చేసి, సిద్ధంగా ఉంచాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో స్పెషలాఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు, హెచ్‌ఎం, వార్డెన్లతో పీఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని డార్మెటరీ, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బాత్రూంలు ఇతర మౌలిక వసతులన్నింటినీ నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రతి పాఠశాలను, హాస్టల్‌ను సందర్శించి ప్రతిపాదనలు తయారు చేసి త్వరగా అందచేయాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టాలని, సెలవుల్లో సైతం పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఉద్దీపనం వర్క్‌బుక్‌లు విద్యార్థులకు ఉపయోగపడేలా చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు సైతం వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అందుకోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి 15 రోజుల్లో ప్రతిపాదనలు తనకు సమర్పించాలన్నారు. సమావేశంలో డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓలు అశోక్‌కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, డీఈ మధూకర్, ఏఈ రవి, జీసీడీఓ అలివేలుమంగతాయారు పాల్గొన్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో సీటు సాధించిన విద్యార్థినికి ఐటీడీఏ తరఫున ల్యాప్‌టాప్‌ను పీఓ రాహుల్ మంగళవారం అందజేశారు. అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన వాసం గాయత్రి భద్రాచలంలోని టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివి, గేట్ రాసి 8,300 ర్యాంకు సాధించింది. ఆమెకు ల్యాప్‌టాప్‌ను పీఓ అందజేశారు. కార్యక్రమంలో డేవిడ్ రాజ్, విద్యార్థిని తల్లి లలిత తదితరులు పాల్గొన్నారు.


