
ఇఫ్తార్ విందుతో ఐక్యతాభావం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇఫ్తార్ విందు ప్రజల మధ్య ఐక్యతాభావం పెంపొందిస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి కొత్తగూడెం క్లబ్‌లో కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాలస్థాయిలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ఉపవాసదీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ పండుగల సమయంలో అధికారిక కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, మైనార్టీ నాయకుడు నయీం ఖురేషి, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, మత పెద్దలు జహంగీర్ షరీఫ్, రబ్‌సాబ్, అబీద్ హుస్సేన్, జావీద్ సాటే, బాసిత్, ఖాద్రి, యాకూబ్, సీపీఐ నాయకులు దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళి, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, నాగా సీతారాములు, పల్లపోతు సాయి పాల్గొన్నారు.