● ప్రజల్లో పెరుగుతున్న అవగాహన.. ● అవసరాన్ని గుర్తించి లైసెన్స్‌కు క్యూ కడుతున్న యువత ● మూడేళ్లలో 36,243 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ● పోలీసులు, ఆర్టీఏ అధికారుల చొరవ
కొత్తగూడెంటౌన్: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే శిక్షార్హులు.. రోడ్డెక్కి వాహనం నడపాలి అంటే లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి.. అనే నినాదాలు పనిచేస్తున్నాయి. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు యువతలో మార్పు కనిపిస్తోంది. లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలని యువత భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో లైసెన్స్ కోసం వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజూ ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతుండడం, లైసెన్స్ లేకుంటే పడే శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండటం.. ప్రమాదంతోపాటు లైసెన్స్ లేకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుండటంతోపాటు ఆర్టీఏ అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తుండటంతో యువతతో పాటు అన్ని వర్గాల్లో కదలిక వచ్చినట్లయిందని అధికారులు చెబుతున్నారు.
2 లక్షలకు పైగానే వాహనాలు
జిల్లావ్యాప్తంగా దాదాపు 2,02,811 టూ, త్రీ, ఫోర్ వీలర్లు (వాహనాలు) ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వాహనం నడపాలంటే తప్పని సరిగా లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన ఉంది. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు అసలు వాహనం నడపడానికి అర్హులుకారనే విషయం తెలిసిందే. కాగా, మూడేళ్లలో పోలీస్ అధికారులు, జిల్లా రవాణా శాఖాధికారులు, ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో మార్పు వచ్చిందని, రోజూ ఆర్టీఏ కార్యాలయానికి లైసెన్స్‌ల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా మూడేళ్లలో దాదాపు 36,243 మంది డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఇటివల ట్రాఫిక్ ఎస్‌ఐ నరేశ్.. లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువెళ్లి, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాంటే 18 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ట్రాఫిక్ సంబంధించి లైసెన్స్ (మొదట లెర్నింగ్ లైసెన్స్‌ను) టెస్టును నిర్వహించి కేటాయిస్తారు. ఇది పూర్తి అయిన తరువాత ఆరునెలల కాలంలో మరోసారి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని, ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు.
వాహనదారులకు లైసెన్స్
ఉండాల్సిందే..
జిల్లావ్యాప్తంగా సుమారు 2,02,811 టూ, త్రీ, ఫోర్ చక్రాలు కలిగిన వాహనాలున్నాయి. ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చినట్లు గణాంకాలు చూస్తే తెలుస్తోంది. అందరూ లైసెన్స్ తీసుకుని వాహనం నడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్లుగా 36,243 మంది లైసెన్స్ పొందారు. ట్రాఫిక్, రవాణాశాఖ నియమ, నిబంధనలను వాహనదారులు పాటించాలి. ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాల్సిందే..
–వి.వెంకటరమణ,
జిల్లా ఇన్‌చార్జ్ రవాణా శాఖ అధికారి
జిల్లాలో లైసెన్సుల జారీ వివరాలు
కేటగిరీ 31–12–2022 2023 2024 2025
వరకు (ఇప్పటివరకు)
హెవీ మోటార్ వెహికల్స్ 252 291 269 49
మీడియం మోటార్ వెహికల్స్ 0 0 0 0
లైట్ మోటార్ వెహికల్స్ 3,531 4,420 258 950
మోటార్ సైకిల్, స్కూటర్, మోపెడ్స్ 4,351 5,189 5,336 926
ట్రాక్టర్స్ 564 668 728 148
ఇతర కేటగిరి వాహనాలు 763 1,082 1,269 199
మొత్తం 9,461 11,650 12,860 2,272
లైసెన్స్ ఉండాల్సిందే..