పాల్వంచరూరల్: ఐదు రోజులుగా ఆరు ఆయిల్ ఇంజన్లు పెట్టి నీటిని కాలువలోకి తరలిస్తున్నా పంట పొలాలకు చేరకపోవడంతో రైతులు కలవరం చెందుతున్నారు. పొట్ట దశకు చేరిన వరి పంట నీరందరక ఎండిపోతోంది. వరి మడులు నెర్రెలు వారుతున్నాయి. మండల పరిధిలోని ప్రభాత్‌నగర్‌లో కిన్నెరసాని ఎడమ కాలువ కింద మూడు వందల ఎకరాల వరకు యాసంగిలో వరి సాగుచేశారు. ఈ పొలాలకు కిన్నెరసానితోపాటు రాళ్లవాగు పికప్ డ్యామ్ నీళ్లు కూడా వస్తాయి. గత వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా రాళ్లవాగు పికప్ డ్యామ్ తూము వద్ద గండిపడి నీళ్లు వృథాగా పోయాయి. దీంతో నీటిమట్టం అడుగంటింది. దీనికితోడు కిన్నెరసాని ఎడమ కాలువ తూము వద్ద నీటిమట్టం తగ్గిపోవడంతో నీళ్లు రావడంలేదు. రైతులు సమస్యను మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు ఈ నెల 17న కిన్నెరసాని వద్ద ఆరు ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేశారు. రాత్రి పగలు నీటిని ఎడమ కాలువలోకి మళ్లిస్తున్నా ఇంతవరకు ఆ నీళ్లు కాలువ ద్వారా ఎండిపోతున్న పంటలకు చేరుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కాలువలో మట్టికట్టలు అడ్డంగా ఉన్నాయి
కిన్నెరసాని ఎడమ కాలువ తూము వద్ద ఆరు ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసి ఐదు రోజుల నుంచి నీటిని కాలువలోకి తరలిస్తున్నాం. కాలువలో అక్కడక్కడా మట్టికట్టలు అడ్డంగా ఉండటంతో నీటి ప్రవాహం నెమ్మదించింది. ఇప్పటివరకు మూడు కిలోమీటర్ల వరకు నీళ్లు వెళ్లాయి. రైతులు ముందుకు వచ్చి మట్టికట్టలు తొలగిస్తే ప్రవాహం పెరిగి నీళ్లు త్వరగా పొలాలకు అందుతాయి.
–చంద్రశేఖర్, ఇరిగేషన్ డీఈ
ఆరు ఆయిల్ ఇంజన్లతో ఎత్తిపోస్తున్నా అందని సాగునీరు
పొట్ట దశకు చేరిన పంట చేజారుతోందని రైతుల ఆవేదన
ఎండుతున్న వరి పొలం