● కంపోస్టు డెవలప్‌మెంట్ అధికారి హేమలత ● 9 మున్సిపాల్టీల సిబ్బందికి ఇల్లెందులో ఒకరోజు శిక్షణ
ఇల్లెందు: ప్రతీ మున్సిపాలిటీలో ‘సిటీ శానిటేషన్ ప్లాన్’ రూపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు, శానిటేషన్ జవాన్లకు కంపోస్టు డెవలప్‌మెంట్ అధికారి హేమలత సూచించారు. నూరుశాతం జీరో బేస్డ్ శానిటేషన్ పట్టణాలుగా మార్చాలని, అందుకు అగ్రభాగాన ఉన్న ఇల్లెందు మున్సిపాల్టీలోని సక్సెస్‌ను అధ్యయనం చేసేందుకు వచ్చిన మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 మున్సిపాల్టీల అధికారులు, సిబ్బందికి ఇల్లెందులో మంగళవారం ఒకరోజు శిక్షణ ఇచ్చారు. భైపాస్ రోడ్‌లోని డంప్‌యార్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హేమలత పలు అంశాలపై వివరించారు. ప్రతీ మున్సిపాల్టీలో చెత్త ఉత్పత్తి అయ్యే ప్రదేశాలను గుర్తించాలని, ఎంత మేర చెత్త లభిస్తుందో అంచనా వేయాలని సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీకి తడి చెత్త లభించే ప్రదేశాలను గుర్తించాలన్నారు. కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మార్కెట్‌ను ఎంచుకోవాలని సూచించారు. ప్రతీ వారం సమీక్షలు నిర్వహించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూర్, ఖమ్మం, మఽధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీల అధికారులు పాల్గొన్నారు.