ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
పినపాక: ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ దిలీప్ కుమార్ హెచ్చరించారు. శనివారం తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి బయ్యారం క్రాస్‌రోడ్‌లో తనిఖీలు చేపట్టారు. ఇసుక లారీలను ఆపి డీడీలను పరిశీలించారు. అనుమతులు లేకుండా ఇసుక తోలకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇసుక క్వారీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మలకు ప్రభుత్వం నుండి ప్రత్యేక టోకెన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పవర్ ప్లాంట్ ఎదురు అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను పరిశీలించి జప్తు చేశారు. వివరాలు సేకరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
పులి సంచారం లేదు
● రేంజర్ నరసింహారావు
గుండాల: గుండాల అటవీ ప్రాంతంలో పులి సంచారం లేదని, మండల సరిహద్దు ప్రాంతాల్లో అన్వేషిస్తున్నామని రేంజర్ నరసింహారావు తెలిపారు. గుండాల, మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలాల సరిహద్దుల్లో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన ఫారెస్ట్ అధికారులు శనివారం అన్వేషణ ప్రారంభించారు. గుండాల, గంగారం, దుబ్బగూడెం, కొత్తగూడ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వెతకగా పులి అడుగుజాడలు కనిపించలేదని తెలిపారు. ప్రజలు, బాటసారులు భయభ్రాంతులకు గురికావొద్దని చెప్పారు. డిసెంబర్, జనవరి మాసాలలో పులి ఎదకు వచ్చే సమయం కావడంతో అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని అన్నారు. చేను పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతాలతోపాటు నీటి వనరులు ఉన్నచోట ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రోజూ అటవీశాఖ అధికారులు అన్వేషణ చేస్తారని అన్నారు. సమీప ప్రాంతాల్లో పులి అడుగుజాడలు కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు.
బాలుడిపై కేసు.. జువైనల్ హోమ్‌కు తరలింపు
బంజారాహిల్స్: పాల్వంచ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16), బాలుడు (16) ఇద్దరూ పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదవగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాది క్రితం వరకు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో ఇద్దరి కుటుంబీకులకు తెలియడంతో మేజర్లు అయ్యేవరకు కలుసుకోవద్దని చెప్పారు. దీంతో బాలుడు ఇంటర్ మొదటి సంవత్సరం పాల్వంచలో చదువుతుండగా, బాలిక హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లోని ఎన్‌బీటీనగర్ బస్తీలో గది అద్దెకు తీసుకుని కుట్టు శిక్షణ తీసుకుంటోంది. గతనెల 31న బాలుడు హైదరాబాద్‌లోని బాలిక గదికి రాగా, నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అయితే బాలుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హైదరాబాద్ ఎన్‌బీటీ నగర్‌కు రాగా, బాలిక, బాలుడు కనిపించారు. అప్పటికే వచ్చిన బాలిక తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోక్సో కేసు నమోదు
దమ్మపేట: బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికను ఆమె సమీప బంధువైన వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు
కోడిపందేల స్థావరాలపై దాడులు
బూర్గంపాడు: మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామసమీపంలో రాజీవ్‌నగర్ వద్ద కోడిపందేల స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. తొమ్మిదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ.17 వేల నగదు, 8 సెల్‌ఫోన్లు, 8 బైక్‌లు, 7 పందెం కోళ్లు, కోడి కాళ్లకు కట్టే 12 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బూర్గంపాడు స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్‌ఐ ప్రవీణ్ తెలిపారు.
బీట్ ఆఫీసర్ సస్పెన్షన్
జూలూరుపాడు: జూలూరుపాడు అటవీ నర్సరీ బీట్ ఆఫీసర్ నర్సింహారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల పాపకొల్లు గ్రామంలోని సదరు బీట్ ఆఫీసర్ ఇంట్లో అక్రమంగా కలప నిల్వ చేయడంతో అటవీశాఖ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై శనివారం జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావును సంప్రదించగా.. ఎఫ్‌బీఓను సస్పెండ్ చేస్తూ డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు


