పీఎస్‌ఈ ప్రక్రియ పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఈ ప్రక్రియ పూర్తి చేయండి

Jan 4 2026 10:50 AM | Updated on Jan 4 2026 10:50 AM

పీఎస్

పీఎస్‌ఈ ప్రక్రియ పూర్తి చేయండి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/భద్రాచలంటౌన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లో భాగంగా ఫొటో సిమిలర్‌ ఎంట్రీ(పీఎస్‌ఈ) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి పి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగాప్రసాద్‌, ఎన్నికల సిబ్బంది నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

భద్రాచలంటౌన్‌: పట్టణంలోని సిటీ స్టైల్‌ జిమ్‌కు చెందిన పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారుడు డీవీ శంకర్‌ రావు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి బెంచ్‌ ప్రెస్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడంతో జాతీయ పోటీలకు అర్హత సాధించాడు.హరియాణాలోని ఫరీదాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో పాల్గొంటారని జిమ్‌ కోచ్‌ జి.వి. రామిరెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా శంకర్‌ రావును తెలంగాణ రాష్ట్ర పవర్‌ లిఫ్టింగ్‌ ఉపాధ్యక్షుడు వి. మల్లేష్‌, జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్‌ రెడ్డి, గ్రీన్‌ భద్రాద్రి సభ్యులు, గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు అభినందించారు.

రామభక్తుల పాదయాత్ర

జూలూరుపాడు: ధనుర్మానం సందర్భంగా శనివారం పలువురు రామభక్తులు పాదయాత్ర నిర్వహించారు. జూలూరుపాడులోని శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం, గుండెపుడి శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

పాల్వంచ: ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యాలయంలో బండ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఫారెస్ట్‌ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటుంటే ఆదివాసీలు జీవనాధారమైన భూమిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు మోర రవి, సూరేపల్లి వెంకటేశ్వర్లు, శర్ప నారాయణ, కుంజ వెంకటేశ్వర్లు, ఊకం పాపారావు, మడివి సోమయ్య, రెంటాల నారాయణ, రాజు, గంగయ్య, మమత పాల్గొన్నారు.

భద్రాచలంలో కార్డన్‌ సెర్చ్‌

భద్రాచలంటౌన్‌: పట్టణంలోని ఏఎంసీ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కాలనీని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, నేరస్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు తనిఖీలు చేపట్టామన్నానరు. సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సతీష్‌, శ్యామ్‌, స్వప్న పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌

అభిమానులకు బెయిల్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న, ఓపార్టీ నేతల జోక్యంతో పెట్టి న కేసుతో జైలుకు వెళ్లి న వైఎస్సార్‌, జగన్‌ అభిమానులకు బెయిల్‌ లభించింది. ఈ మేరకు ఆలస్యం సుధాకర్‌, మర్రి శ్రీనివాస్‌, యర్రా నాగరాజురెడ్డి, గంగరబోయిన రవి, గణ పారపు మురళి, సరికొండ రామరాజు, శివారెడ్డి తదితరులకు శనివారం పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయగా జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారికి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్‌ అభిమానులు స్వాగతం పలికారు.

పీఎస్‌ఈ ప్రక్రియ  పూర్తి చేయండి1
1/1

పీఎస్‌ఈ ప్రక్రియ పూర్తి చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement