వివాదాస్పద భూమిలో సర్వేను అడ్డుకున్న రైతులు
ఇల్లెందురూరల్: మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ శివారులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు కేటాయించిన భూమి విషయంలో సర్వే నంబర్ వివాదాస్పదమైంది. దీంతో బాధత రైతులు న్యాయం కోరుతూ ఏడాది క్రితం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో సర్వే నంబర్‌పై స్పష్టత ఇచ్చేందుకు ల్యాండ్‌సర్వే విభాగం అధికారులు సర్వే చేపట్టారు. కాగా, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కేటాయించిన స్థలం విషయంలో స్పష్టత వచ్చినట్లు పేర్కొంటూ సదరు భూమిని స్కూల్ నిర్మాణం కోసం ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వు పత్రంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు సిబ్బంది శనివారం స్థలంలో సర్వే ప్రారంభించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారంటూ బాధిత రైతులు అరుణ, కొమరయ్య, చిలకమ్మ, సౌజన్య, బాలచందర్, లక్ష్మి తదితరులు పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన ఆర్‌ఐ కామేశ్వరరావును రైతులు నిలదీశారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను వారికి అందజేసి పూర్తిస్థాయి సమాచారం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆర్‌ఐ బాధిత రైతులకు సూచించారు. సరిహద్దులతో కూడిన పంచనామా రిపోర్టు ఇవ్వనందున తాము ఎవరినీ సంప్రదించబోమని, న్యాయం కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు.


