భయం.. భయం
అసంపూర్తిగా నిర్మించిన
కల్వర్టుతో ప్రమాదం
పట్టించుకోని జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ శాఖలు
జాతీయ రహదారిపై
అశ్వారావుపేటరూరల్: జాతీయ రహదారుల శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డు వెడల్పు 100 అడుగులు ఉండగా, కేవలం 80 అడుగుల వరకే కల్వర్టు శ్లాబు నిర్మించి వదిలేశారు. నిత్యం రద్దీగా జాతీయ రహదారిపై వాహనదారులు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సూర్యాపేట నుంచి దేవరపల్లి వెళ్లే 365బీబీ జాతీయ రహదారిపై అశ్వారావుపేట పట్టణంలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల పనులు సాగుతుండగా, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో మెగా డ్రెయినేజీ వంకర టింకరగా నిర్మించారు. అంతర్గత రోడ్లకు సంబంధం లేకుండా డివైడర్ల పనులు చేపట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. సమారు రెండు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో సత్తుపల్లి వైపు వెళ్లే మార్గంలోని ఓ రెస్టారెంట్ వద్దగల కాలువపై కల్వర్టును అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. జాతీయ రహదారి కావడంతో 100 అడుగుల వెడల్పు, మధ్యలో డివైడర్ ఉంది. ఇక్కడ వంద అడుగుల దాకా కల్వర్టు నిర్మించాల్సి ఉండగా, కేవలం 80 అడుగుల వెడల్పు వరకే శ్లాబ్ నిర్మించారు. దీంతో కాలువ జాతీయర రహదారి మధ్యలోకి చొచ్చుకుని వచ్చినట్లు ఉండి, ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఆర్‌అండ్‌బీ డీఈ ప్రకాశ్‌ను వివరణ కోరగా.. కల్వర్టు నిర్మాణ ప్రాంతం జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉందని, కల్వర్టు పూర్తి చేసేందుకు తాము కూడా ప్రతిపాదనలు పంపామని తెలిపారు.


