నగదు చెల్లించాలని రుణదాతల నిరసన
మణుగూరు టౌన్: ఇద్దరు వ్యాపారులు పలువురి వద్ద అప్పుతీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రుణదాతలు శనివారం నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని వ్యాపారులు రామ్,లక్ష్మణ్‌లు మణుగూరుకే చెందిన పలువురు నుంచి రూ.2.10 కోట్లు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి చేయడంతో కోర్టు ద్వారా నోటీసులు పంపి ఉన్నప్పుడు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో వారి సమీప బంధువైన ఓ గిన్నెల కొట్టు వ్యాపారి రుణం పొందిన వ్యాపారుల పేరు మీద ఉన్న ఇంటిని విక్రయించి రూ.1.10 కోట్ల చెల్లిస్తానని అంగీకరించాడు. రూ. 50 లక్షలు చెల్లించాడు. మరో రూ.60 లక్షలు ఇవ్వడంలేదు. దీంతో విసిగి వేసారిన బాధితులు శనివారం నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని ప్లకార్డులు చేబూని నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారి దుకాణం ఎదుట నిరసన తెలిపారు. నగదు ఇవ్వకుంటే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.


