కొత్తగూడెంఅర్బన్ : ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 12,282 మంది రెగ్యులర్, 686 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, వీరి కోసం 73 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 77 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 871 మంది ఇన్విజిలేటర్లు, 73మంది సిట్టింగ్, 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలి పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరని, పరీక్ష విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సైతం సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ నంబర్ 99666 00678 ను సంప్రదించాలని సూచించారు.
మాధారం పాఠశాలలో తనిఖీ
ములకలపల్లి: మండలంలోని మాధారం ప్రాథమికోన్నత పాఠశాలను డీఈఓ వెంకటేశ్వరా చారి, జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ సతీష్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న టాయిలెట్లను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారి సామర్థ్యాలను పరిశీలించారు.
డీఈఓ వెంకటేశ్వరా చారి