లోక్ అదాలత్‌లో 4,598 కేసుల పరిష్కారం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ మెగా లోక్ అదాలత్‌లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4,598 కేసులు పరిష్కారం అయ్యాయని ఎస్పీ రోహిత్‌రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో క్యాలెండర్ కేసులు 383, డ్రంక్ అండ్ డ్రైవ్ 3,098, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన, ఈ–పిటీ కేసులు 1,117 ఉన్నాయని వివరించారు. పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత వారం రోజులుగా కక్షిదారులను కలిసి రాజీమార్గమే మేలని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందుతుందని అవగాహన కల్పించిన ఫలితంగానే కేసులు పరిష్కారం అయ్యాయని వివరించారు. ఈ మేరకు కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. వారికి తగిన రివార్డులు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో నమోదైన 71 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించామని, నగదు కోల్పోయిన బాధితులకు రూ.15,86,229 కోర్టు ద్వారా అందజేస్తామని పేర్కొన్నారు.
ఆర్టీసీలో డీఎంల బదిలీ
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీలో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రీజియన్‌లో సత్తుపల్లి డిపో మేనేజర్ వి.సునీత సూర్యాపేటకు, సూర్యాపేట డీఎం జీ.ఎల్.నారాయణ సత్తుపల్లికి బదిలీ అయ్యారు. అలాగే, మధిర డిపో మేనేజర్ డి.శంకర్‌ను మియాపుర్ డిపో ఏడబ్ల్యూఎం, బీబీ యూగా బదిలీ చేశారు. అంతేకాక భద్రాచలంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.రామయ్యకు డిపో మేనేజర్‌గా పదోన్నతి కల్పిస్తూ మధిర డీఎంగా నియమించారు.
దరఖాస్తుల ఆహ్వానం
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 32 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల (రెగ్యులర్ బేసిస్) నియామకానికి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి జనవరి 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, జనవరి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనరల్ సర్జన్–4, గైనకాలజిస్ట్–7, అనస్తీషియా–7, పిల్లల వైద్యులు–4, చెస్ట్ ఫిజీషియన్–3, ఈఎన్‌టీ సర్జన్–2, పాథాలజిస్ట్–1, హెల్త్ ఆఫీసర్–3 పోస్టులు ఉన్నట్లు వివరించింది.
స్వర్ణోత్సవాలకు రండి..
పాల్వంచరూరల్ : ఈనెల 28న నిర్వహించే కిన్నెరసాని గురుకుల స్వర్ణోత్సవాలకు హాజరుకావాలని ఎస్పీ రోహిత్‌రాజ్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మను కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, పూర్వ విద్యార్థులు సోమవారం ఆహ్వానించారు. గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 26వ తేదీన పూర్వ విద్యార్థుల ర్యాలీ ఉంటుందని, అందుకు అనుమతించాలని కోరారు. కాగా, వేడుకలకు హాజరయ్యేందుకు ఎస్పీ, ట్రెయినీ కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రమేష్ రాథోడ్, కుంజా రాజేష్, దారావత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


